వంజంగి హిల్స్‌పై కోల్డ్‌వార్
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:04 PM
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే పాడేరు మండలం వంజంగి హిల్స్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటి వరకు ఐటీడీఏ నేతృత్వంలో స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో వంజంగి హిల్స్ ఉండగా, తాజాగా అటవీ శాఖ స్వాధీనానికి చర్యలు చేపడుతుండడంతో వివాదం నెలకొంది.
పర్యాటకాభివృద్ధిపై అటవీ శాఖ, స్థానికుల మధ్య వివాదం
నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న పర్యాటక సీజన్
వంజంగి టూరిజంపై 22న ఐటీడీఏలో సమన్వయ సమావేశం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే పాడేరు మండలం వంజంగి హిల్స్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటి వరకు ఐటీడీఏ నేతృత్వంలో స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో వంజంగి హిల్స్ ఉండగా, తాజాగా అటవీ శాఖ స్వాధీనానికి చర్యలు చేపడుతుండడంతో వివాదం నెలకొంది. ఇన్నాళ్లూ మిన్నకుండి తాజాగా కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడతామని అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదమైంది. దీని వలన తమకు అన్యాయం జరుగుతుందని స్థానిక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు నుంచి ఏజెన్సీలో పర్యాటక సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ముఖ్యమైన వంజంగి హిల్స్‌పై వివాదాలు నెలకొనడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
వంజంగి హిల్స్‌పై అధికారుల అనాలోచిత నిర్ణయమే ఇప్పుడు వివాదానికి కారణమైందనే వాదన బలంగా వినిపిస్తున్నది. పాడేరు మండలం వంజంగి కొండలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని ప్రాంతాలు. అయితే ఆయా ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా గుర్తించి, ప్రకటించే క్రమంలోనే అధికార యంత్రాంగం పక్కా నిర్ణయం తీసుకుని అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ ఐటీడీఏ, అటవీ అధికారులు అప్పట్లో ఆ దిశగా కనీసం ఆలోచన చేయకుండా తమ అనాలోచిత నిర్ణయాలతో ఐదేళ్ల క్రితం వంజంగి హిల్స్‌ను పర్యాటక ప్రదేశంగా ప్రకటించి, స్థానిక గిరిజనులతో ఒక కమిటీని వేసి దాని నిర్వహణను అప్పగించారు. ఆ సమయంలోనే అటవీ శాఖాధికారులు తమ అభ్యంతరాలను తెలిపి, అటవీ చట్టాలకు లోబడి వంజంగి హిల్స్ నిర్వహణ జరిగేలా చూడాల్సి ఉండగా, కనీసం పట్టించుకోలేదు. దీంతో అది రిజర్వు ఫారెస్ట్ అనే విషయాన్నే ఐటీడీఏ అధికారులు మరిచి, మామూలు కొండల్లో వలే పర్యాటకులకు ప్రవేశం, స్థానికులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో గత ఐదేళ్లుగా అదే విధంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. వంజంగి కొండలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని ప్రాంతాలు కావడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ తాజాగా చర్యలు ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఊరుకుని తాజాగా కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడతామని అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని స్వాధీనం చేసుకుంటామని అటవీ అధికారులు ముందుకు వెళ్లగా, స్థానికులు అభ్యంతరాలు తెలుపుతుండడంతో ప్రస్తుతం వివాదం నెలకొంది. దీంతో అటవీ సిబ్బంది వంజంగి హిల్స్ వైపు రాకూడదని స్థానికులు, అవి మా రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాలని అటవీ శాఖ పేర్కొంటున్నది. ఈ నెలాఖరు నుంచి పర్యాటక సీజన్ ప్రారంభం కానుండడంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక జిల్లా యంత్రాంగం తల పట్టుకుంటున్నది.
22న సమన్వయ సమావేశం
వంజంగి హిల్స్‌పై పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడుతున్న క్రమంలో అటవీశాఖ, స్థానిక గిరిజనుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఐటీడీఏ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, వంజంగి, లగిశపల్లి, కాడెలి పంచాయతీల ప్రజలు, పలు సంఘాలు, కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరుకావాలని సూచించారు. అలాగే ఈ సమావేశానికి ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ. డివిజనల్ అటవీ అధికారి పీవీ.సందీప్‌రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు హాజరవుతారు. ఈ క్రమంలో వంజంగి హిల్స్‌పై స్థానికుల సహకారంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టేందుకు అందరి నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు సేకరించి, అందరి సమన్వయంలో వంజంగి హిల్స్‌పై పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్నది.