Share News

అనంతగిరిలో కాఫీ హబ్‌

ABN , Publish Date - May 17 , 2025 | 12:58 AM

అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీనికితోడు ఐటీడీఏ ప్రోత్సాహం అందించడంతో రైతులు కాఫీ సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు. అంతేకాకుండా వన్‌దన్‌ వికాస కేంద్రాల ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అనంతగిరిలో రూ.15 లక్షలతో భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనంలోనే ఐటీడీఏ సహకారంతో కాఫీ హబ్‌ను ఏర్పాటు చేశారు.

అనంతగిరిలో కాఫీ హబ్‌
అనంతగిరిలో ఐటీడీఏ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన కాఫీ హబ్‌

ఐటీడీఏ నిధులతో ఏర్పాటు

రూ.18 లక్షలతో కాఫీ ఫల్పింగ్‌, రోస్టింగ్‌,

పౌడర్‌, ప్యాకింగ్‌ మిషన్లు కొనుగోలు

భీసుపురం జయశ్రీ గ్రూపు నిర్వహణ

దేశ విదేశాలకు ఎగుమతికి ఐటీడీఏ సహకారం

అనంతగిరి, మే 12 (ఆంధ్రజ్యోతి):

అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీనికితోడు ఐటీడీఏ ప్రోత్సాహం అందించడంతో రైతులు కాఫీ సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు. అంతేకాకుండా వన్‌దన్‌ వికాస కేంద్రాల ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అనంతగిరిలో రూ.15 లక్షలతో భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనంలోనే ఐటీడీఏ సహకారంతో కాఫీ హబ్‌ను ఏర్పాటు చేశారు.

రూ.18 లక్షలతో కాఫీ యంత్రాల కొనుగోలు

ఐటీడీఏ ప్రోత్సాహంతో కాఫీ హబ్‌లో ఫల్పింగ్‌, రోస్టింగ్‌, పౌడర్‌, ప్యాకింగ్‌ యంత్రాలను కొనుగోలు చేశారు. అనంతగిరి మండలంలోని 9 వీడీవీకేల్లో పైనంపాడు, వాలసీ, కంటిపురం, షాడ, కొండిబల్లో మాత్రమే కాఫీ సాగు జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో పండించిన కాఫీ గింజలను జయశ్రీ గ్రూపు కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేస్తున్నది. అలాగే రైతులే నేరుగా గిట్టుబాటు ధరకు విక్రయించేందుకు అవసరమైన మార్కెటింగ్‌కు జయశ్రీ గ్రూపు సహకారం అందిస్తున్నది. భీసుపురం గ్రామానికి చెందిన రాధ, సుందరమ్మ, చిన్నమ్మి, తదితరులు గ్రూపుగా ఏర్పడ్డారు. వీరికి కాఫీ సాగుపై ప్రత్యేక అవగాహన ఉండడంతోపాటు మార్కెటింగ్‌పై పట్టు ఉంది. అనంతగిరి కాఫీ తోటల వద్ద పలు దుకాణాలను ఏర్పాటు చేసి, అరకు-విశాఖ ప్రధాన రహదారిలో వచ్చేపోయే పర్యాటకులకు కాఫీ పౌడర్‌ను విక్రయిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో కాఫీ అమ్మకాలపై దృష్టి

గిరిజనుల నుంచి సేకరించిన కాఫీ గింజలను కాఫీ హబ్‌లో పౌడర్‌గా తయారు చేసిన అనంతరం ప్యాకింగ్‌ చేసి దేశవిదేశాలకు జయశ్రీ గ్రూపు ఎగుమతి చేస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసేందుకు ఐటీడీఏ ప్రోత్సాహం అందించనుంది. కాఫీ హబ్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుండడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 17 , 2025 | 12:58 AM