Share News

ముమ్మరంగా కాఫీ పండ్ల సేకరణ

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:40 AM

మన్యంలో ప్రస్తుతం కాఫీ పండ్ల సేకరణ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్నది. దీంతో ఏజెన్సీలో ఎక్కడ కాఫీ తోటలు చూసినా గిరిజన రైతులు పండ్లను సేకరిస్తున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.

ముమ్మరంగా కాఫీ పండ్ల సేకరణ
కాఫీ పండ్లను సేకరిస్తున్న కార్మికులు

ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 52 వేల ఎకరాల్లో కాఫీ తోటలు

మొత్తం లక్షా 62 వేల ఎకరాల్లోని తోటల్లో 80 వేల టన్నుల పండ్లు దిగుబడి

14 వేల టన్నుల క్లీన్‌ కాఫీ ఉత్పత్తి జరుగుతుందని అంచనా

పంట ఆశాజనకంగా ఉండడంతో ఆనందంలో గిరిజన కాఫీ రైతులు

కాఫీ కొనుగోలు ధరలు ప్రకటించిన జీసీసీ, ఐటీడీఏ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో ప్రస్తుతం కాఫీ పండ్ల సేకరణ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్నది. దీంతో ఏజెన్సీలో ఎక్కడ కాఫీ తోటలు చూసినా గిరిజన రైతులు పండ్లను సేకరిస్తున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షాలు అనుకూలంగా ఉండడంతో కాఫీ పంట విరగ్గాసింది. దీంతో ఈ ఏడాది పంట నష్టపోకుండా ఉండడంతో పాటు దిగుబడి సైతం 50 నుంచి 60 కిలోలు పెరుగుతుందని భావిస్తున్నారు.

ఏజెన్సీ పదకొండు మండలాల్లో ప్రస్తుతం 2 లక్షల 52 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. వాటిలో లక్షా 62 వేల ఎకరాల్లోని తోటల్లో 80 వేల టన్నుల కాఫీ పండ్లు దిగుబడి వస్తుందని ఒక అంచనా. వాటిని శుద్ధి చేస్తే 14 వేల టన్నుల క్లీన్‌(పార్చిమెంట్‌) కాఫీ ఉత్పత్తి అవుతుంది. అలాగే ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో పంట సైతం కాస్త తొందరగా కోతకు వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది వర్షాలు కాఫీ తోటలకు అనుకూలం

ఏజెన్సీలోని కాఫీ తోటలకు ఈ ఏడాది వర్షాలు బాగా అనుకూలించాయి. ప్రతి ఏడాది మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్‌ రెండో వారం వరకు కాఫీ పూత పూస్తుంది. ఆ సమయంలో వర్షాలు కురిస్తేనే పూత బలంగా నిలబడి పిందెకు అవకాశం ఉంటుంది. వర్షాలు కురవకుండా మంచు కురిస్తే పూత మాడిపోయి పిందెదశకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే. జూన్‌, జూలై నెలల్లో సైతం వర్షాలు అనుకూలించాయి. ఆఖరుకు పిందె బలంగా ఉన్న సమయం ఆగస్టు నెలలో సైతం వర్షాలు కురవడంతో దిగుబడికి మరింత అవకాశం కలిగిందని కాఫీ రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఏజెన్సీ వ్యాప్తంగా లక్షా 62 వేల ఎకరాల్లో కాఫీ దిగుబడి

గిరిజనులు పోడు వ్యవసాయంతో అడవులను నాశనం కాకుండా ఉండేందుకు గానూ 1989లో కాఫీ సాగును ప్రభుత్వం గిరిజనులకు పరిచయం చేసింది. దీంతో 1989 నుంచి 2002 వరకు కేవలం 32,072 ఎకరాల్లో మాత్రమే కాఫీ తోటలు అభివృద్ధి జరగ్గా, 2003 నుంచి 2008 వరకు 64,265 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు. ఆ తరువాత 2009లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. దీంతో 2009 నుంచి 2016 వరకు 61,684 ఎకరాల్లో, 2016 నుంచి ఇప్పటి వరకు 94 వేల ఎకరాల్లో కాఫీని అభివృద్ధి చేశారు. ఈ లెక్కన 1989 నుంచి 2025 వరకు ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 52 వేల 21 ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ఆయా తోటల ద్వారా 2 లక్షల 36 వేల 618 మంది గిరిజన కాఫీ రైతులు లబ్ధి పొందుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా గిరిజన రైతులు స్వయంగా తమ వారసత్వ భూముల్లో వేసుకున్న సుమారుగా 30 వేల ఎకరాలు కలిపి మొత్తం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. అయితే వాటిలో సుమారుగా లక్షా 52 వేల ఎకరాల్లో ఏడాదికి 80 వేల టన్నుల కాఫీ పండ్లు దిగుబడి వస్తుందని అంచనా. దీంతో సుమారుగా 14 వేల టన్నుల క్లీన్‌(పార్చిమెంట్‌) కాఫీ గింజలు ఉత్పత్తి అవుతున్నది. ఏడాదికి ఒక ఎకరం కాఫీ తోటతో సుమారుగా రూ.40 నుంచి 50 వేలు ఆదాయం సమకూరుతున్నది. దీంతో కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే సేంద్రీయ పద్ధతిలో గిరిజనులు కాఫీ ఉత్పత్తిని చేస్తుండడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మన్యం కాఫీకి గిరాకీ ఉంది.

ఈ ఏడాది కాఫీ కొనుగోలు ధరలివే...

గిరిజన రైతుల నుంచి కాఫీ పండ్లు, గింజల కొనుగోలు ధరలను సైతం ఇప్పటికే గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ప్రకటించాయి. జీసీసీ ద్వారా అరబికా పార్చిమెంట్‌ కాఫీని కిలో రూ.450, అరబికా చెర్రీ కిలో రూ.270లు, రొబస్టా కిలో రూ.170లకు కొనుగోలు చేస్తామని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, జీసీసీ ఎండీ కల్పనకుమారి ప్రకటించారు. అలాగే ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చింతపల్లి మ్యాక్స్‌ సంస్థ ద్వారా ఏ గ్రేడు కిలో కాఫీ పండ్లను రూ.60, బీ గ్రేడు రూ.55 చొప్పున కొనుగోలు చేస్తామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ప్రకటించారు.

కాఫీ సేకరణ ధరలు పెంచిన ఏపీఎఫ్‌డీసీ

ఏజెన్సీలో ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనే సుమారుగా 10 వేల హెక్టార్లలో కాఫీ తోటలున్నాయి. ఆయా తోటల్లో గిరిజనులు కాఫీ పండ్ల సేకరణ చేపడుతుంటారు. ఈ ఏడాది గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా ఏపీఎఫ్‌డీసీ సైతం ధరలు పెంచింది. కార్మికులకు రోజు కూలీ గతంలో రూ.321 ఉండగా, ఈ ఏడాది రూ.351లకు పెంచింది. అలాగే గతంలో కిలో పండ్ల సేకరణకు రూ.6 పది పైసలుకాగా, దానిని ఈ ఏడాది రూ.6.66 పైసలకు పెంచారు. అలాగే కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమాను ప్రకటించారు. ఏజెన్సీ వ్యాప్తంగా కాఫీ పండ్ల సేకరణకు గానూ వె య్యి మంది గిరిజనులకు ఏపీఎఫ్‌డీసీ ఉపాధి కల్పిస్తున్నది. అయితే ఈ ఏడాది సేకరణ, కూలీ ధరలను పెంచడంతో కార్మికులు, గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:40 AM