కాఫీ రైతు బజార్లు
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:09 AM
మన్యంలో కాఫీ రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ‘కాఫీ రైతు బజార్’లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
రైతులను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు
నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేయాలి
పల్పింగ్ యూనిట్లకు 30 శాతం రాయితీ
చింతపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
కాఫీ కొనుగోలుకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
పాడేరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
మన్యంలో కాఫీ రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ‘కాఫీ రైతు బజార్’లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. మన్యంలో కాఫీ మార్కెటింగ్, నాణ్యతపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన్యం కాఫీకి అరకు కాఫీగా ప్రపంచ స్థాయిలో చక్కని గుర్తింపు ఉందన్నారు. ఈ గుర్తింపుపై ఎటువంటి మచ్చపడకుండా కాఫీ క్రయవిక్రయాలు జరగాలని, నాణ్యత సైతం మరింతగా పెరగాలన్నారు. కాఫీ ఫల్పింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేసుకునే రైతులకు 30 శాతం రాయితీపై అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తామన్నారు. జి.మాడుగుల, జీకేవీధి ప్రాంతాల్లో కాఫీ పల్పింగ్ యూనిట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో శ్రీపూజను ఆదేశించారు. గిరిజన రైతులను ప్రోత్సాహించేందుకు చింతపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
కాఫీ కొనుగోలుకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
మన్యంలోని గిరిజన రైతుల నుంచి కాఫీ గింజలను కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు రవాణా చేసే వారు తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ పొందాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు. కాఫీ విక్రయాల్లో దళారుల బెడదను అరికకట్టేందుకు కృషి చేస్తున్నామని, ట్రేడర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇందుకు సహకరించాలన్నారు. కాఫీ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, అంతర్జాతీయ స్థాయిలోనే నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేయాలన్నారు. కాఫీ కొనుగోలు చేస్తున్న వారందరితో ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా క్రయవిక్రయాలు, మార్కెట్ ధరలు, ఇతర అంశాలను సమన్వయం చేసుకుంటామని చెప్పారు. కాఫీ కొనుగోలులో మోసాలకు ఆస్కారం లేకుండా ఐటీడీఏ, జీసీసీ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. లైసెన్స్ లేకుండా కాఫీ గింజలు కొనుగోలు, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం కాఫీ విభాగం, ఉద్యావన శాఖ మంజూరు చేసిన ట్రేడ్ లైసెన్స్‌లను పలువురు వర్తకులు, రైతుఉత్పత్తిదారు సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, కాఫీ ఏడీ ఎల్.బొంజుబాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, రైతు సాధికారత సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.