అంతర్జాతీయ ప్రమాణాలతో కాఫీ అభివృద్ధి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:15 PM
జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ వెల్లడి
కర్ణాటకలోని మడికరి, కుషాల్ ప్రాంతాల్లో
టాటా కాఫీ తోటల పరిశీలన
అక్కడ సాగు పద్ధతులు జిల్లాలో అమలుకు యోచన
పాడేరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. ఏజెన్సీలో కాఫీ తోటలకు బెర్రీబోరర్ సమస్య ఏర్పడడం, తొలుత నుంచి కాఫీ దిగుబడులు అంతంతమాత్రంగానే ఉండడంతో కర్ణాటక రాష్ట్రంలో కాఫీ తోటలను సందర్శనకు ఆయన కాఫీ బోర్డు అధికారులతో కలిసి వెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ జిల్లాలో మడికరి, కుషాల్ ప్రాంతాల్లో టాటా సంస్థకు ఉన్న కాఫీ తోటలను ఆయన ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా అక్కడ కాఫీ తోటల అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, పద్ధతులను పరిశీలించారు. అలాగే కాఫీ గింజలకు ఎటువంటి తెగుళ్లు, చీడపీడలు రాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపడతున్నారని టాటా ఎస్టేట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని కాఫీ తోటల స్థితిగతులను వారికి తెలియజేశారు. అలాగే టాటా కాఫీ ఎస్టేట్‌లో పండిన కాఫీ గింజల నాణ్యతను అక్కడ ఉన్న ల్యాబ్‌లో పరిశీలించారు. ఈక్రమంలో జిల్లాలోని గిరిజన ప్రాంతంలో కాఫీ తోటలను సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా నాణ్యమైన కాఫీ ఉత్పత్తి అవుతుందని, ఫలితంగా గిరిజన రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. అందుకు అవసరమైన చర్యలను చేపడతామని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే మన్యంలోని కాఫీకి అరకు కాఫీగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని, ఈక్రమంలో దానిని మరింత నాణ్యంగా ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో కాఫీ తోటల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ టాటా కాఫీ ఎస్టేట్ అధికారులను కోరారు. అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని కుర్గ్ జిల్లా కలెక్టర్‌ను సైతం దినేశ్‌కుమార్ కలిసి కాఫీ తోటల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టాటా కాఫీ ఎస్టేట్ అధికారుల వినయ్, అయ్యప్ప, కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, సీనియర్ లైజర్ అధికారి ఎల్.రమేశ్ పాల్గొన్నారు.