Share News

ఆశాజనకంగా కాఫీ సాగు

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:07 PM

మన్యంలో కాఫీ సాగు ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కాఫీ పంటకు వర్షాలు కలిసిరావడంతో కాఫీ మొక్కల్లో కాపు బాగుంది. దీంతో ఈ ఏడాది కాఫీ దిగుబడులు పెరుగుతాయని గిరిజన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆశాజనకంగా కాఫీ సాగు
అద్దరవీధిలో గుత్తులుగా కాసిన కాఫీ కాయలు

అనుకూలించిన వర్షాలు

దిగుబడులు పెరుగుతాయంటున్న గిరిజన రైతులు

గూడెంకొత్తవీధి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కాఫీ సాగు ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కాఫీ పంటకు వర్షాలు కలిసిరావడంతో కాఫీ మొక్కల్లో కాపు బాగుంది. దీంతో ఈ ఏడాది కాఫీ దిగుబడులు పెరుగుతాయని గిరిజన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు 2.58 ఎకరాల్లో కాఫీ సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. 1960లో ఏపీఎఫ్‌డీసీ తొలిసారిగా కాఫీ సాగును ప్రారంభించింది. నాటి నుంచి గిరిజన ప్రాంతంలో కాఫీ సాగు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం ఆదివాసీల ప్రధాన ఆదాయ పంట స్థానాన్ని కాఫీ సొంతం చేసుకుంది. కాఫీ పంటకు మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో వర్షాలు అత్యంత కీలకం. గిరిజన ప్రాంతంలో ఈ రెండు నెలల్లోనూ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంత నేలలు, వాతావరణం కాఫీ పంటకు కలిసొచ్చింది. దీంతో కాఫీ పంట సాగు గిరిజన ప్రాంతానికి అనుకూలించింది. గత ఏడాది కాఫీ ఉత్పత్తిలో దిగ్గజాలైన బ్రెజిల్‌, వియత్నం దేశాల్లో దిగుబడులు భారీగా పడిపోయాయి. దీంతో గిరిజన రైతులు సాగు చేసిన కాఫీ గింజలకు రెక్కలొచ్చాయి. కాఫీ పార్చిమెంట్‌ గరిష్ఠంగా రూ.552, చెర్రీ రూ.310 ధర లభించింది. అయితే గత ఏడాది ఆశించిన దిగుబడులు రైతులు పొందలేకపోయారు. ఈ ఏడాది వర్షాలు, వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఏడాది మాదిరిగా కాఫీ ధరలు ఉంటే ఈ ఏడాది రైతులకు కాఫీ సిరుల పంట కురిపించనున్నది.

Updated Date - Jul 27 , 2025 | 11:07 PM