Share News

చింతపల్లిలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:30 AM

స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి చెందినట్టు కేంద్ర కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు గుర్తించారు. అరకులోయలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు బయటపడడంతో గిరిజన ప్రాంతంలో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సర్వే చేస్తున్నారు.

చింతపల్లిలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు
ఉద్యాన పరిశోధన స్థానం తోటల్లో కాఫీ బెర్రీ బోరర్‌ వ్యాప్తి చెందిన మొక్కలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు సునీల్‌బాబు, బిందు, జేఎల్‌వో రవికుమార్‌

హెచ్‌ఆర్‌యూలో ప్రాథమిక పరీక్షల్లో గుర్తించిన కేంద్ర కాఫీ బోర్డు అధికారులు

నియంత్రణ చర్యలు ప్రారంభించిన ఉద్యాన శాస్త్రవేత్తలు

చింతపల్లి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి చెందినట్టు కేంద్ర కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు గుర్తించారు. అరకులోయలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు బయటపడడంతో గిరిజన ప్రాంతంలో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సర్వే చేస్తున్నారు. బుధవారం స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో కాఫీ తోటలను ఆర్‌వీనగర్‌ కేంద్ర కాఫీ పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అధిపతి డి.సునీల్‌బాబు, జూనియర్‌ లైజనింగ్‌ అధికారి జె.రవికుమార్‌, స్థానిక అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు పరిశీలించారు. ఉద్యాన పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న అరబిక, రొబస్ట్రా కాఫీ తోటల్లో ప్రాథమిక దశలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు కేవలం అరకులోయ చిన్నలబుడు పంచాయతీ పరిధిలోనే ఈ తెగులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఈ తెగులు బయటపడడం రైతులను కలవరపెడుతున్నది. ఈ సందర్భంగా ఆర్‌వీనగర్‌ కేంద్ర కాఫీ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సునీల్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లి మండల కేంద్రం మ్యాక్స్‌, ఐటీడీఏ నిర్వహణలో ఉన్న ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉద్యాన పరిశోధన స్థానం కాఫీ తోటలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది అరకులోయ ప్రాంతం నుంచి కాఫీ గింజలను చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చి పల్పింగ్‌ చేయడం, ఎండబెట్టడం వల్ల ఈ తెగులు సమీపంలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం కాఫీ తోటలకు వ్యాప్తి చెంది వుంటుందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఈ తెగులును కలిగించే ఆడ బోరర్‌(కీటకం) 500 మీటర్ల వరకు ఎగురుతుందని, మగ బోరర్‌ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందన్నారు. ఎకో పల్పింగ్‌ యూనిట్‌కి అతి సమీపంలో ఉద్యాన పరిశోధన స్థానం కాఫీ తోటలు ఉండడం వల్లనే ఈ తెగులు వ్యాప్తి చెంది వుంటుందన్నారు. ఎకో పల్పింగ్‌ యూనిట్‌ పది కిలోమీటర్ల లోపు కాఫీ తోటలను పరిశీలించగా, ఎక్కడా ఈ తెగులు కనిపించలేదన్నారు. అరకులోయ, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో మినహా ఎక్కడా ఈ తెగులు ఇంత వరకు బయటపడలేదన్నారు. ఉద్యాన పరిశోధన స్థానంలో ఈ తెగులు నియంత్రణకు ప్రాథమికంగా సిరమోన్‌ ట్రాప్‌లు ఏర్పాటు చేశామన్నారు. కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు తొలిదశలోనే నాశనం చేసేందుకు చర్యలు ప్రారంభించామని, తెగులు నియంత్రణకు చేపట్టాల్సిన నివారణ చర్యలను ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలకు తెలియజేశామన్నారు. ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త బిందు మాట్లాడుతూ పరిశోధన స్థానం కాఫీ తోటలో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు నియంత్రణ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించామన్నారు. ఈ తెగులు వ్యాప్తి చెందిన తోటలను క్వారంటైన్‌ చేశామని చెప్పారు.

Updated Date - Sep 04 , 2025 | 12:30 AM