Share News

నిలిచిన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు!

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:16 AM

పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడే చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిర్వహించే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలు గడిచిన నాలుగు నెలలుగా నిలిచిపోయాయి.

నిలిచిన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు!

వినికిడి సమస్యతో జన్మించే చిన్నారులకు ఈ శస్త్రచికిత్స వరం

సుమారు పది లక్షల రూపాయలు వ్యయమయ్యే సర్జరీ ఎన్‌టీఆర్‌ వైద్య సేవలో ఉచితంగా నిర్వహణ

ఆడిట్‌ పేరుతో గడిచిన నాలుగు నెలల నుంచి నిలిచిపోయిన ఆపరేషన్లు

మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు

ఆలస్యమయ్యే కొద్దీ కొందరు అర్హత కోల్పోయే ప్రమాదం

విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడే చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిర్వహించే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలు గడిచిన నాలుగు నెలలుగా నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన ఈ శస్త్ర చికిత్సలను ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. అయితే, ఇప్పటివరకూ జరిగిన వాటికి సంబంధించి ఆడిట్‌ను నిర్వహిస్తున్నందున తాత్కాలికంగా శస్త్ర చికిత్సలు నిలిపివేయాలంటూ జిల్లాలోని ఆస్పత్రులకు ఆదేశాలు అందాయి.

సాధారణంగా 11 నెలలు వయసు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే ఈ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సలను చేస్తుంటారు. మూడేళ్లలోపు చేయించుకుంటే ఫలితం మెరుగ్గా ఉంటుంది. అయితే, చిన్నారుల్లో సమస్యను తల్లిదండ్రులు సకాలంలో కనుగొనలేకపోతున్నారు. మూడు, నాలుగేళ్లు దాటిన తరువాత కొందరు, ఐదేళ్లు వచ్చిన తరువాత మరికొందరు గుర్తించగలుగుతున్నారు. చిన్నారులకు వివిధ రకాల పరీక్షలు చేసి, వారు శస్త్రచికిత్సకు అర్హులు అని నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలలు సమయం పడుతుంది. ఈలోగా వయసు ఐదేళ్లకు మించకూడదు. అప్పుడు మాత్రమే శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. అయితే, ఇప్పుడు నాలుగు నెలల నుంచి శస్త్ర చికిత్సలను నిర్వహించే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చాలామంది చిన్నారులకు వయసు దాటిపోతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.

నెలకు ఆరు నుంచి ఎనిమిది..

కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్ర చికిత్సలను పెదవాల్తేరులోని ప్రభుత్వ ఈఎన్‌టీ, గాయత్రీ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు ఆస్పత్రుల్లో నెలకు ఆరు నుంచి ఎనిమిది వరకు నిర్వహిస్తుంటారు. ఈ శస్త్ర చికిత్స నిర్వహించడానికి ముందు చిన్నారికి ఆస్పత్రి అధికారులు పరీక్షలు నిర్వహించి, అనంతరం అమర్చాల్సిన పరికరం కోసం ఎన్‌టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌కు ఇండెంట్‌ పెడతారు. ప్రభుత్వమే ఆయా పరికరాలను కొనుగోలు చేసి ఆస్పత్రులకు సరఫరా చేస్తుంది. ఒకేసారి నెలకు ముగ్గురు, నలుగురు చిన్నారులకు అవసరమైన పరికరాల కోసం అధికారులు ఇండెంట్‌ పెడుతూ ఉంటారు. ఇలా పరికరాలు వచ్చిన తరువాత చిన్నారులకు శస్త్రచికిత్సలను నిర్వహిస్తారు. శస్త్రచికిత్స అనంతరం సదరు చిన్నారులకు స్పీచ్‌ థెరపీ వంటివి చేయడం ద్వారా సాధారణ స్థితికి తీసుకువస్తారు. ఈ శస్త్రచికిత్సను బయట చేయించుకోవాలంటే సుమారు రూ.8 లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వమే ఈ మొత్తాన్ని భరించి ఎన్‌టీఆర్‌ వైద్య సేవలో చేస్తుండడంతో ఎంతోమంది చిన్నారులకు మేలు చేకూరుతోంది. ఈ శస్త్ర చికిత్సల కోసం ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన చిన్నారులు నగరంలోని ఆస్పత్రులకు వస్తుంటారు. ఇప్పుడు వారంతా మళ్లీ ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందా?...అని ఎదురుచూస్తున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 01:16 AM