Share News

ఆటో డ్రైవర్ల సేవలో...కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:16 AM

‘ఆటో డ్రైవర్ల సేవలో...’ పథకం కింద జిల్లాలో 22,955 మందికి రూ.34.43 కోట్లు పంపిణీ చేస్తున్నట్టు ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు.

ఆటో డ్రైవర్ల సేవలో...కూటమి ప్రభుత్వం

జిల్లాలో 22,955 మందికి రూ.34.43 కోట్లు విడుదల

లబ్ధిదారులకు చెక్కు అందజేసిన ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి

విశాఖపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):

‘ఆటో డ్రైవర్ల సేవలో...’ పథకం కింద జిల్లాలో 22,955 మందికి రూ.34.43 కోట్లు పంపిణీ చేస్తున్నట్టు ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో శనివారం ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 2014-19 మధ్యకాలంలో తమ ప్రభుత్వం ఆటోలకు లైఫ్‌ ట్యాక్స్‌ను మినహాయిస్తే, ఇప్పుడు అధికారంలోకి రాగానే గ్రీన్‌ ట్యాక్స్‌ను కూడా రద్దు చేసిందన్నారు. ఆటోడ్రైవర్లకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే తమకు తెలిపితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఈ పథకంలో అర్హులైన వారికి డబ్బులు అందకపోతే వార్డు, గ్రామ సచివాలయాన్ని సంప్రతిస్తే ప్రభుత్వం పరిశీలించి తగినచర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాల అమలుకు వెనకడుగు వేయకుండా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ హిట్‌ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నగర అభివృద్ధికి కొత్తపెట్టుబడులను తీసుకొస్తోందన్నారు. రాబోయే రోజుల్లో టీసీఎస్‌ వంటి కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు శ్రీధర్‌, రాంబాబు మాట్లాడుతూ ఈ మొత్తం తమ కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తాయంటూ ఉద్విగ్నతకు గురయ్యారు. ప్రభుత్వం తమ పట్ల చూపిన ఆప్యాయతను మరిచిపోలేమన్నారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లకు చెక్కును మంత్రి, ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందజేసారు. అంతకుముందు సర్య్కూట్‌హౌస్‌ నుంచి మంత్రి డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే వెలగపూడి, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ ఆటోలో ప్రయాణించి సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌కు చేరుకున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 01:16 AM