Share News

ఆటో డ్రైవర్ల సేవలో.. కూటమి సర్కారు

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:54 PM

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా జిల్లాలో 13,753 మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.20 కోట్ల 62 లక్షల 95 వేలు లబ్ధి చేకూరుతుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

  ఆటో డ్రైవర్ల సేవలో.. కూటమి సర్కారు
టో డ్రైవర్లకు నమూనా చెక్కు అందజేస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఇన్‌చార్జి మంతి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్‌

జిల్లాలో 13,753 మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు లబ్ధి

వారి బ్యాంకు ఖాతాల్లో రూ.20,62,95000లు జమ

రాష్ట్రంలో 60 శాతం మందికి సంక్షేమ ఫలాలు

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా జిల్లాలో 13,753 మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.20 కోట్ల 62 లక్షల 95 వేలు లబ్ధి చేకూరుతుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు ఈ పథకాల వలన లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను నాయకులు తీసుకోవాలన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పటికి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పచ్చి అబద్దాలతో మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, బయట నుంచి మాట్లాడడం కాదని చెప్పారు. అసెంబ్లీకి వస్తే అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే అవకాశం ఇస్తానన్నారు. స్పీకర్‌.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నారని, ఇచ్చే అధికారం తనకు లేదని చాలా సార్లు చెప్పానని స్పష్టం చేశారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చావుదెబ్డ తీశారని విమర్శించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న రూ.4 వేలు పెన్షన్‌ పథకం దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. 1994 నుంచి చంద్రబాబు హయాంలో డీఎస్సీ ద్వారా 1,96,400 ఉద్యోగాలు తీశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క పోస్టు కూడా తీయలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల డీఎస్సీ తీసి మరో 16,347 ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.115 కోట్లు మంజూరు చేయించానన్నారు. అవసరమైతే మరో రూ.100 కోట్లు తెస్తానని తెలిపారు. నర్సీపట్నం మెడికల్‌ కళాశాల కోసం 2022లో సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు అడిగితే అధికారులు ఇక్కడ లేదని ఇచ్చారని తెలిపారు. ఎన్‌ఎంసీ అనుమతి లేకుండా మెడికల్‌ సీట్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో కూడా 50 సీట్లు మెరిట్‌ స్టూడెంట్స్‌కి ఇస్తారన్నారు. అదీ కూడా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో తనపై పెట్టిన పోస్టుపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐని ఆయన ఆదేశించారు.

ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఆటో డ్రైవర్లు సేవలో పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్ల దుస్థితి ఎలా ఉండేదో ఆటో కార్మికులు అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆటో మరమ్మతులు, కేసులకు వేల రూపాయలు అపరాధ రుసుములు చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు. రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్‌ రూ.4 వేలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి పెన్షన్‌ పెంచుతానని హామీ ఇచ్చి మొదటి విడత 250 పెంచారని, తరువాత ఎన్నికలు దగ్గర పడే సమయానికి వెయ్యి పెంచారని తెలిపారు. గతం కంటే పెన్షన్‌దారులు పెరిగారని తెలిపారు. రైతు బందు పథకం కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇస్తున్నామని తెలిపారు. హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతో దసరా కానుకగా వారి ఖాతాలలో రూ.15 వేలు చొప్పున జమ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఆర్డీవో వీవీ రమణ, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, ఏఎంసీ చైర్మన్‌ గవిరెడ్డి రమణ, టీడీపీ మండల అధ్యక్షుడు సుకల అప్పలనాయుడు, తాండవ చైర్మన్‌ కరక సత్యనారాయణ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:54 PM