స్టీల్ ప్లాంటులో బుగ్గి అవుతున్న బొగ్గు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:11 AM
స్టీల్ ప్లాంటులోని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ విభాగంలో బొగ్గు కాలిపోతోంది.
పట్టించుకోని యాజమాన్యం
విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటులోని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ విభాగంలో బొగ్గు కాలిపోతోంది. అడపా దడపా వర్షాలు పడుతున్నా మంటలు తగ్గడం లేదు. స్టీల్ ప్లాంటులో ధర్మల్ విద్యుత్ కేంద్రం నడపడానికి ఈ బొగ్గును ఉపయోగిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటులో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి అవసరమైన ప్రాంతాలకు కన్వేయర్ల ద్వారా పంపిస్తారు. ఈ బొగ్గు నిల్వలు ఎండల వేడికి తగలబడిపోకుండా నిత్యం నీటిని విరజిమ్మడానికి కాంట్రాక్టు వర్కర్లు పనిచేస్తుంటారు. ఇటీవల యాజమాన్యం కాంట్రాక్టు వర్కర్లు ఎక్కువగా ఉన్నారని వేలాది మందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇక్కడ బొగ్గు నిల్వలను పర్యవేక్షించేవారు కరవయ్యారు. గత నాలుగు రోజులుగా బొగ్గు కుప్పలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లినా నివారణ చర్యలు ఎందుకు చేపట్టలేదో తెలియడం లేదు. ఇలా బొగ్గు నిల్వలు కాలిపోతుంటే భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. తక్షణమే యాజమాన్యం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.