సీఎం పర్యటన రద్దు
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:16 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూలై ఒకటిన పాడేరు మండలం ఉగ్గంగొయ్యి గ్రామంలో జరగాల్సిన పర్యటన రద్దయింది. వాస్తవానికి సీఎం చంద్రబాబునాయుడు జూలై ఒకటిన పాడేరు మండలం ఉగ్గంగొయ్యి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారు
- మావోయిస్టుల ప్రభావం నేపథ్యంలో నిర్ణయం
పాడేరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూలై ఒకటిన పాడేరు మండలం ఉగ్గంగొయ్యి గ్రామంలో జరగాల్సిన పర్యటన రద్దయింది. వాస్తవానికి సీఎం చంద్రబాబునాయుడు జూలై ఒకటిన పాడేరు మండలం ఉగ్గంగొయ్యి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించి, అక్కడకు సమీపంలో గిరిజనులతో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే పాడేరు ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం దృష్ట్యా నిఘా వర్గాల సూచన మేరకు ఈ పర్యటన రద్దు అయింది. దీంతో ముఖ్యమంత్రి పర్యటనను కాకినాడ జిల్లా జగ్గంపేటకు మార్పు చేసినట్టు తెలిసింది. కాగా సీఎం బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేసేందుకు రప్పించిన సామగ్రిని తిరిగి కాకినాడ జిల్లాకు తరలిస్తున్నారు. సీఎం పర్యటనపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయని కలెక్టర్ దినేశ్‌కుమార్ పాడేరులో ప్రతికూల వాతావరణం నేపథ్యంలోనే సీఎం పర్యటన రద్దయిందని శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలపడం విశేషం.
సీఎం పర్యటన రద్దు విషయం తెలియక ముందు..
సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఉందనే ఉద్దేశంతో శనివారం ఉదయం అధికారులు ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఉగ్గంగొయ్యి గ్రామానికి పక్కా రోడ్డును నిర్మించడంతో పాటు విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు తదితర పనులు చేపట్టారు. ఉగ్గంగొయ్యి, లగిశపల్లి గ్రామాలకు మధ్యలో బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన స్థలాన్ని గుర్తించి చదును చేసే పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, ఎస్‌పీ అమిత్‌బర్ధార్, డీఆర్‌డీఏ వి.మురళి, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాలసుందరంబాబు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.