Share News

సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:26 AM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 9న పాడేరు వస్తున్న సందర్భంగా అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపడుతున్నది.

సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం
హెలీప్యాడ్‌ వద్ద అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

- కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ పర్యవేక్షణ

- సభా వేదికను సిద్ధం చేస్తున్న యంత్రాంగం

పాడేరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 9న పాడేరు వస్తున్న సందర్భంగా అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపడుతున్నది. ప్రధానంగా సీఎం చంద్రబాబు వంజంగి గ్రామ సమీపంలోని కాఫీ తోటల సందర్శన, రైతులతో ముఖాముఖి, తరువాత అక్కడికి సమీపంలో గిరిజన పండుగలు, సంప్రదాయ ప్రదర్శనలు, గిరిజనులతో బహిరంగ సభకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, సీఎం ఏర్పాట్ల కమిటీ ప్రతినిధులు జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ గిరిజన కాఫీ రైతులు, గిరిజన పండుగలపై సీఎంకు వివరించే గిరిజనులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే లగిశపల్లి గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ ప్రదేశాన్ని, గిరిజనులతో, తరువాత కార్యకర్తలతో సమావేశమయ్యే రెండు సభా వేదికలు, వంజంగి గ్రామ చావడి, తదితర ప్రదేశాలను కలెక్టర్‌ సందర్శించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా వేదికలతో పాటు జిల్లా కేంద్రం పరిసరాల్లోనూ పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు, సీఎం వచ్చే ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌ త నిఖీలతోపాటు పటిష్ట భద్రతకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ప్రత్యేక బలగాలను రప్పించి కాన్వాయ్‌, ఇతర వాహన శ్రేణిలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని, 7వ తేదీ నుంచి 9వ తేదీన సీఎం కార్యక్రమం ముగిసే వరకు ఘాట్‌ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు నిషేధించామన్నారు. అలాగే అవసరాలకు అనుగుణంగా అత్యవసర ట్రాఫిక్‌ మళ్లింపులు వంటి చర్యలు చేపడతామని, ఈక్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిరంతర నిఘాలో ఉంచామన్నారు. ఈ కార్యక్రమాల్లో అడిషన్‌ ఎస్‌పీ కె.ధీరజ్‌, చింతపల్లి ఏఎస్‌పీ నవజ్యోతిమిశ్రా, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌, రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:26 AM