Share News

నేడు సీఎం రాక

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:17 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం నగరానికి రానున్నారు.

నేడు సీఎం రాక

కాపులుప్పాడలో కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన

మధ్యాహ్నం రుషికొండలో విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ సమావేశానికి హాజరు

విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం నగరానికి రానున్నారు. ఉండవిల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు నేరుగా రుషికొండ ఐటీ హిల్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి కాపులుప్పాడ వెళ్లి 11.20 గంటలకు కాగ్నిజెంట్‌ ఐటీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. 11.20 నుంచి 11.40 గంటల వరకూ కాగ్నిజెంట్‌తోపాటు శంకుస్థాపన జరిగే ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సంభాషిస్తారు. అదే ప్రాంతంలో ఏర్పాటుచేసిన సభలో 11.40 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరిశ్రమల ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులు, ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రుషికొండలోని ఏ-1 గ్రాండ్‌కు చేరుకుని విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి సీఎం అధ్యక్షత వహిస్తారు.


మంత్రి లోకేశ్‌కు ఘనస్వాగతం

నేడు రుషికొండలో కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం

మరో ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన

విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. రాత్రి పది గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌, దాడి రత్నాకర్‌, తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న లోకేశ్‌కు పలువురు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. పార్టీ కార్యాలయంలో లోక్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేశ్‌ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో గల బస్సులో రాత్రి బస చేశారు.

మంత్రి లోకేశ్‌ శుక్రవారం ఉదయం ఐటీ హిల్స్‌లో ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌లోని హిల్‌-2పై మహతి ఫిన్‌టెక్‌ భవనంలో కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగులతో ముచ్చటిస్తారు. ఆ తరువాత హిల్‌-3కు చేరుకొని శ్రీటెక్‌ తమ్మిన సంస్థకు భూమిపూజ చేస్తారు. అక్కడే నాన్‌రెల్‌ టెక్నాలజీస్‌, ఏసీఎన్‌ ఇన్ఫోటెక్‌ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి 2.9 కి.మీ. దూరానున్న హిల్‌-4కు చేరుకొని సత్వాస్‌ వాంటేజ్‌ వైజాగ్‌ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి కాపులుప్పాడ వెళతారు. అక్కడ ఇమ్మాజినోటివ్‌, ఫ్లూయెంట్‌ గ్రిడ్‌, మదర్‌సన్‌ టెక్నాలజీస్‌, క్వార్క్స్‌ టెక్నోసాఫ్ట్‌ సంస్థల శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం కాగ్నిజెంట్‌కు కేటాయించిన స్థలానికి వెళతారు. సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి కాగ్నిజెంట్‌కు శంకుస్థాపనలో పాల్గొంటారు. తొమ్మిది ఐటీ కంపెనీలు కలిపి రూ.3,740 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటివల్ల 41,700 మందికి ఉద్యోగాలు రానున్నాయి.


రీజియన్‌లో 49 ప్రాజెక్టులు

కార్యాచరణ ప్రణాళిక సిద్ధం

అనకాపల్లి జిల్లాలో స్టీల్‌ పరిశ్రమ, బొమ్మలు, చెప్పులు, ఫర్నీచర్‌ తయారీ పార్కులు

విశాఖలో డేటా సెంటర్లు, ఎడ్యుకేషన్‌ హబ్‌, సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, పౌలీ్ట్ర పరిశ్రమలు

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై నేడు రుషికొండలో సీఎం అధ్యక్షతన తొలి భేటీ

శ్రీకాకుళం నుంచి అంబేడ్కర్‌ కోనసీమ వరకూ తొమ్మిది జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు హాజరు

విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధికి వేర్వేరు రీజియన్లు ఏర్పాటుచేసింది. శ్రీకాకుళం నుంచి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ వరకూ తొమ్మిది జిల్లాలతో ఏర్పాటైన విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ పరిధిలో అభివృద్ధి చేయాల్సిన అంశాలపై కార్యాచరణ రూపొందించింది. మొత్తం 49 ప్రాజెక్టులను గుర్తించిన ప్రభుత్వం దానికి సంబంధించి 10 విధానాలకు రూపకల్పన చేసింది. వచ్చే మూడు నెలల్లో కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ తొలి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం రుషికొండలోని ఏ-1 గ్రాండ్‌లో జరగనున్నది. ఈ సమావేశంలో 49 ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

- అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రెండు వేల ఎకరాల్లో స్టీల్‌ పరిశ్రమను ఏర్పాటుచేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కెమికల్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తారు. కాకినాడ, శ్రీకాకుళం గ్యాస్‌ పైపులైన్‌ అందుబాటులోకి తీసుకువస్తారు. మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల మధ్య అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో 400 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పుతారు. శ్రీకాకుళం, నక్కపల్లి, మెడ్‌టెక్‌ జోన్‌లలో మూడు లైఫ్‌ సైన్స్‌ పార్కులు ఏర్పాటుచేస్తారు.

- మూలపేట పోర్టు పరిధిలో షిప్‌ బిల్డింగ్‌, మరమ్మతుల సెంటర్‌, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేయనున్నారు. నక్కపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో 200 నుంచి 400 ఎకరాల్లో బొమ్మలు, చెప్పులు, ఫర్నీచర్‌ తయారీ పార్కులు, విశాఖపట్నం జిల్లాలో 500 నుంచి 1,000 ఎకరాల్లో మల్టీ ప్రొడక్ట్సు, ఎలకా్ట్రనిక్స్‌ తయారీ జోన్‌, అనకాపల్లి జిల్లాలో రెన్యు ఎనర్జీ, గ్రీన్‌ అమ్మోనియం ప్లాంటు, శ్రీకాకుళంలో బీచ్‌ శాండ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇంకా కాకినాడ నుంచి విజయనగరం మధ్య మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు, కాపులుప్పాడ, ఆనందపురంలో 900 ఎకరాల్లో డేటా సెంటర్లు, విశాఖలో విద్య హబ్‌, సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, పౌలీ్ట్ర పరిశ్రమలు, వ్యవసాయ, ఉద్యానవనాలు, సముద్ర నాచు ఉత్పత్తి వంటి రంగాల్లో ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తారు.

- విశాఖలో క్రూయిజ్‌ టెర్మినల్‌, వైజాగ్‌ బేసిటీ పేరిట సాహస క్రీడలకు వసతుల కల్పన, కైలాసగిరిలో వెల్‌నెస్‌ సెంటర్‌, ప్రజలకు అవసరమైన హౌసింగ్‌ ప్రాజెక్టులు, 2030 కల్లా విశాఖ మెట్రో పూర్తిచేయడం, భోగాపురంలో ఏరో సిటీ, రీజియన్‌లో దేవాలయాల అనుసంధానంతో పర్యాటకులను ఆకర్షించడం, కొత్త రైల్వేస్టేషన్లు, రోడ్డు ప్రాజెక్టులు వంటి వాటిని కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పది పాలసీలు రూపొందించనున్నారు. పలు శాఖలను భాగస్వామ్యం చేసిన ప్రభుత్వం విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌కు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2032 నాటికి అమలు చేయాల్సిన అంశాలను మొదటి ప్రాధాన్యంగా తీసుకోనున్నారు. తొలి సదస్సుకు సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, తొమ్మిది జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లు, ఆయా విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరుకానున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 01:17 AM