నేడు సీఎం రాక
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:00 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల శుక్రవారం నగరానికి రానున్నారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల శుక్రవారం నగరానికి రానున్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ మీడియేషన్ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఉదయం 7.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 8.50 గంటలకు రుషికొండ వద్ద గల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి తొమ్మిది గంటలకు రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళతారు. ఉదయం పది నుంచి 11.30 గంటల వరకూ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు హోటల్ నుంచి తిరిగి రుషికొండ హెలిప్యాడ్‌కు చేరుకుని 11.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉండవల్లి వెళతారని అధికార వర్గాలు తెలిపాయి.
పెందుర్తిలో జె.కుమార్ ఇన్‌ఫ్రా
ప్రాజెక్టుకు మంత్రిమండలి పచ్చజెండా
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
అమరావతిలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విశాఖ జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులకు అనుమతించారు. పెందుర్తిలో జె.కుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు ఆమోదించారు. వీరు 63.37 ఎకరాల్లో ప్రాజెక్టు నిర్మిస్తారు. అందులో ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది. అదే విధంగా భోగాపురం విమానాశ్రయం సమీపాన ఎన్‌కామ్ పేరుతో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మిస్తారు. ఇది తాజ్ వివంతా అనుబంధ సంస్థ. అందులో 250 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.