29న సీఎం రాక
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:19 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న నగర పర్యటనకు రానున్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న నగర పర్యటనకు రానున్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.20 గంటలకు నగరానికి చేరుకుంటారు. తొలుత నోవాటెల్‌లో జరగనున్న ఫుడ్ మానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌లో ఉదయం 11.45 నుంచి 12.45 గంటల వరకు పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గంలో రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకుని అక్కడ జరిగే గ్రిఫిన్ ఫౌండర్ నెట్‌వర్క్ మీటింగ్‌కు హాజరవుతారు. సాయంత్రం 4.20 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని బెంగళూరు వెళతారు.
విగ్రహం ఎత్తును బట్టి నిమజ్జన ప్రదేశాలు ఎంపిక
క్యూఆర్‌కోడ్ ఉన్న వాహనాలకే అనుమతి
బాణసంచా నిషేధం
సీపీ శంఖబ్రతబాగ్చి
విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు సీపీ శంఖబ్రతబాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. వినాయకచవితికి మండపాలు వేసేవారంతా సింగిల్‌విండో విధానంలో అనుమతి తీసుకోగానే వారికి క్యూఆర్‌కోడ్ కేటాయిస్తున్నామన్నారు. ఆ కోడ్ కలిగిన వాహనాన్ని మాత్రమే విగ్రహం నిమజ్జనానికి వినియోగించాల్సి ఉంటుందన్నారు. క్యూఆర్ కోడ్‌లేని వాహనాలను అనుమతించబోమన్నారు. అలాగే నిమజ్జనం కోసం వాడే వాహనాన్ని మోటార్‌వెహికల్ ఇన్‌స్పెక్టర్ ద్వారా సర్టిఫై చేయించుకోవడం తప్పనిసరి అన్నారు. వన్‌టౌన్, టూటౌన్, ఫోర్త్ టౌన్, కంచరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు అడుగులులోపు ఉన్న విగ్రహాలను గోకుల్‌పార్కు వద్ద, మూడు నుంచి ఐదు అడుగులలోపు విగ్రహాలను కోస్టల్ బ్యాటరీ వద్ద, ఐదు అడుగులు కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్ వద్ద నిమజ్జనం చేయాల్సి ఉంటుందన్నారు. పెదజాలారిపేట వద్ద నిమజ్జనం నిషేధించామన్నారు. ఎంవీపీ, ద్వారకా, ఆరిలోవ పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని విగ్రహాలను జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్ వద్ద బీచ్‌లో నిమజ్జనం చేయాల్సి ఉంటుందన్నారు. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని విగ్రహాలను ఐటీ సెజ్ జంక్షన్‌లో సముద్రంలో నిమజ్జనం చేయాల్సి ఉంటుందన్నారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం పోలీస్ స్టేషన్ల పరిధితోపాటు విజయనగరం జిల్లా నుంచి వచ్చే విగ్రహాలను భీమిలి లేదా మంగమారిపేట లేదా అన్నవరం వద్ద బీచ్‌లోగానీ, గోస్తనీ నదిలోగానీ నిమజ్జనం చేసుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టు, న్యూపోర్టు, మల్కాపురం పరిధిలోని విగ్రహాలను యారాడ బీచ్, అప్పికొండ బీచ్‌లో నిమజ్జనం చేయాల్సి ఉంటుందన్నారు. పెందుర్తి, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని విగ్రహాలను పినగాడి చెరువు లేదంటే సరిపల్లిలోని శివాలయం చెరువు, రాంపురం చెరువులో నిమజ్జనం చేయాల్సి ఉంటుందన్నారు. వినాయక నిమజ్జనం సమయంలోగానీ, ఊరేగింపు సమయంలోగానీ బాణాసంచా కాల్చడం నిషేధించామన్నారు. అలాగే విగ్రహాల నిమజ్జనం రాత్రి 12 గంటలులోపే పూర్తిచేయాలని స్పష్టంచేశారు. నిమజ్జనం సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు హెల్మెట్ ధరించకపోయినా, మద్యం సేవించి వాహనాలను నడిపినా కేసులు నమోదుచేస్తామన్నారు. ఊరేగింపు సమయంలో ఇతర వాహన చోదకులకు ఇబ్బంది కలిగించినా, మండపాల వద్ద విద్యుత్ వైర్లను ఇతరులకు తగిలేలా వేలాడదీసినా, డీజేలతో ఇతరులకు అసౌకర్యం కలిగించినా కేసులు నమోదుచేస్తామని సీపీ హెచ్చరించారు. ఏదైనా సహాయం కావాలన్నా, సమస్యలు ఉన్నా 7995095799 నంబర్‌కు లేదా 100,102కి ఫోన్ చేయాలని కోరారు.
బార్‌లకు కానరాని స్పందన
జిల్లాలో 121 బార్‌లు
42 బార్‌లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో గడువు మరో మూడు రోజులు పెంపు
ఈనెల 29 వరకు అవకాశం
విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్‌లకు దరఖాస్తు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో 121 బార్‌లకు రెండేళ్ల కాలవ్యవధితో లైసెన్స్ జారీచేసేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి కలిగినవారు ముందుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వెబ్‌సైట్‌లో తమ పేరును ఎన్‌రోల్ చేసుకుని, తర్వాత రూ.5.1 లక్షలు డీడీ తీసి దరఖాస్తుతోపాటు ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేయాలి. దరఖాస్తులకు ఈనెల 26వ ఆఖరు తేదీగా ప్రకటించింది. అయితే వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో దరఖాస్తులు అంతంతమాత్రంగానే అందాయి. మంగళవారం నాటికి జిల్లాలో 121 బార్‌లు ఉండగా 218 మంది ఆన్‌లైన్‌లో పేర్లు ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. కానీ 42 బార్‌లకు మాత్రమే నాలుగేసి చొప్పున దరఖాస్తులు అందాయి. మరో ఐదు బార్‌లకు ఒక్కొక్క దరఖాస్తు అందింది. అయితే బార్‌లకు వేలం వేయాలంటే కనీసం నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా రావాల్సివుంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే మాత్రం వాటిని లాటరీ తీయడానికి పరిగణనలోకి తీసుకోరు. బార్‌లకు వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో గడువును మరో మూడు రోజులు పెంచింది. దీంతో గురు, శుక్రవారాల్లో మిగిలిన బార్లకు దరఖాస్తులు అందుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.