Share News

29న సీఎం రాక

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:59 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న విశాఖపట్నం రానున్నారు.

29న సీఎం రాక

  • 30న చందనోత్సవం నాడు సింహాద్రి అప్పన్నకు పట్టువస్త్రాల సమర్పణ

  • నగరంలో పలు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభింపజేసేందుకు అధికారుల ఏర్పాట్లు

  • జాబితాలో మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ బిల్డింగ్‌ ‘ది డెక్‌’, హెలికాప్టర్‌ మ్యూజియం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న విశాఖపట్నం రానున్నారు. 30వ తేదీన సతీమణితో కలిసి సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ముఖ్యమైన రెండు ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. అందులో ఒకటి...సిరిపురంలోని ఉద్యోగ భవన్‌ ముందు నిర్మించిన మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం ‘దిడెక్‌’. ఇది పేరుకు కారు పార్కింగ్‌ భవనమే అయినప్పటికీ అందులో రాష్ట్ర ప్రభుత్వం రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దానికి కేటాయించగా మిగిలిన స్థలం ఐటీ సంస్థలకు ఇవ్వనున్నారు. మొత్తం 1.72 ఎకరాల స్థలంలో రూ.87.5 కోట్లతో 11 అంతస్థుల భవనం అధునాతనంగా నిర్మించారు. బేస్‌మెంట్‌లో మూడు అంతస్థులు, ఆపైన ఒకటి, రెండు అంతస్థులు (మొత్తం ఐదు అంతస్థులు) పార్కింగ్‌కు కేటాయించారు. వీటి విస్తీర్ణం 1.9 లక్షల చదరపు అడుగులు. వీటిలో 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకోవచ్చు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ను వాణిజ్య అవసరాలకు కేటాయిస్తారు.

బీచ్‌రోడ్డులో హెలికాప్టర్‌ మ్యూజియం

తూర్పు నౌకాదళంతో కలిసి వీఎంఆర్‌డీఏ ఆర్‌కే బీచ్‌లో ‘యుహెచ్‌-3హెచ్‌’ హెలికాప్టర్‌ను మ్యూజియంగా మార్చింది. ఇది సీ హ్యారియర్‌ మ్యూజియానికి, టీయూ 142 మ్యూజియానికి మధ్యన ఉంటుంది. నేవీలో సేవల నుంచి విరమించిన హెలికాప్టర్‌ను తీసుకొచ్చి రూ.2.2 కోట్లతో మ్యూజియంగా మార్పు చేసింది. ఇది పూర్తయి మూడు నెలలు కావస్తోంది. దీనిని కూడా సీఎం చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఇంకా మరికొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:59 AM