Share News

12న సీఎం రాక

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:14 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 12వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ మంగళవారం పరిశీలించారు.

12న సీఎం రాక

కాగ్నిజెంట్‌ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన

అదేరోజు రుషికొండ హిల్‌ 3పై తాత్కాలిక కార్యాలయం ప్రారంభం

విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 12వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ మంగళవారం పరిశీలించారు. కాగ్నిజెంట్‌ సంస్థకు కాపులుప్పాడలో భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ సమావేశం కూడా నిర్వహించనున్నారు. అదే విధంగా రుషికొండ ఐటీ పార్కులో కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌తో కలిసి కలెక్టర్‌ ఆయా ప్రాంతాలను సందర్శించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రుషికొండ ఐటీ పార్కులో హిల్‌ నంబరు 3పై సీఎం దిగే హెలిపాడ్‌ను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులు, కాగ్నిజెంట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


నేరెళ్లవలసలో అక్రమంగా మట్టి తవ్వకాలు

ఓ సొసైటీ లేఅవుట్‌కు

రహదారి నిర్మాణం కోసం తరలింపు

అడ్డుకున్న జనసేన కార్యకర్తలు

జోక్యం చేసుకోవద్దని దళారుల హెచ్చరిక

విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

భీమిలి ఎర్రమట్టి దిబ్బల సమీపాన ఓ కో-ఆపరేటివ్‌ సొసైటీ కోసం రాత్రికి రాత్రి ప్రభుత్వ కొండ పోరంబోకులో మట్టిని అక్రమంగా తవ్వి తీసుకుపోతున్నారు. వారం రోజుల నుంచి రోజూ పదుల సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కో-ఆపరేటివ్‌ సొసైటీ లేఅవుట్‌కు ఎస్‌ఓఎస్‌ ప్రాంతం నుంచి మట్టి రహదారి వేస్తున్నారు. 300 మీటర్ల పొడవు, 25 అడుగుల వెడల్పుతో ఏర్పాటుచేస్తున్న ఈ రహదారిని రెండు అడుగుల ఎత్తున మట్టి పోసి రోలింగ్‌ చేస్తున్నారు. దీనికి అవసరమైన మట్టిని నేరెళ్లవలస సర్వే నంబరు 4లో కొండ పోరంబోకు స్థలంలో తవ్వుతున్నారు. ఇప్పటివరకూ సుమారుగా 280 లారీల మట్టిని తీసుకువెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. సోమవారం రాత్రి స్థానిక జనసేన నాయకులు మట్టి లారీలను అడ్డుకుంటే దళారులు రంగ ప్రవేశం చేసి బెదిరింపులకు దిగారు. జనసేన పార్టీలో పెద్దలతో చెప్పి మంచి పదవి ఇప్పిస్తామని, లారీల జోలికి రావద్దని హెచ్చరించారు. ఈ సొసైటీ సభ్యులు కొన్ని దశాబ్దాలుగా తమ భూమి కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచే తాము భూమిని తీసుకున్నామని వారు మొర పెట్టుకున్నా ఎర్రమట్టి దిబ్బలు కలిగిన ప్రాంతం కావడంతో త్వరగా అనుమతులు రావడం లేదు. ఆ పనులన్నీ తాము చేసి పెడతామంటూ దళారులు రంగంలో దిగి పబ్బం గడుపుకొంటున్నారు. ఈ మట్టి తవ్వకాలపై మైనింగ్‌, రెవెన్యూ శాఖలు దృష్టి పెట్టి, తక్షణమే అడ్టుకట్ట వేయాల్సి ఉంది.


ఆరోపణలు ఉన్న అధికారులపై జీవీఎంసీ కమిషనర్‌ చర్యలు

ఇద్దరు సరండర్‌, మరొకరిపై విచారణకు ఆదేశం

విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ చర్యలు తీసుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో డీఈ స్థాయి అధికారిని సరండర్‌ చేసి, ఏఈ స్థాయి అధికారిపై విచారణకు ఆదేశించినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఒక టీపీఓను సరండర్‌ చేసినట్టు పేర్కొన్నారు.


14న నేవీ మారథాన్‌

17 దేశాల నుంచి ప్రతినిధులు

విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

నేవీ దినోత్సవంలో భాగంగా తూర్పు నౌకాదళం ఈ నెల 14న ‘వైజాగ్‌ నేవీ మారథాన్‌’ నిర్వహించనున్నదని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ వెల్లడించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, పదో ఎడిషన్‌గా నిర్వహిస్తున్న ఈ మారథాన్‌లో 1,750 మంది పాల్గొంటున్నారని, 17 దేశాల ప్రతినిధులు కూడా వస్తున్నారన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లలో వేయి మంది సిబ్బంది, రెండు వేల మంది వలంటీర్లు సేవలు అందిస్తారాన్నరు. ఈ పోటీలు 42 కి.మీ., 21 కి.మీ., 10 కి.మీ., 5 కి.మీ. విభాగాల్లో జరుగుతాయన్నారు. మారథాన్‌ విశాఖలో ఆర్‌కే బీచ్‌ వద్ద ప్రారంభమై, తీరం వెంబడి భీమిలి వరకూ కొనసాగుతుందన్నారు. ప్రతి రన్నర్‌కు డ్రై-ఫిట్‌ టీ షర్ట్‌, నేవీ థీమ్‌ మెడల్‌, గూడీ బ్యాగ్‌, అల్పాహారం అందజేస్తారన్నారు. ప్రజలకు శారీరక దృఢత్వం, సముద్ర వ్యవహారాలపై అవగాహన పెంచడమే దీని ఉద్దేశమన్నారు. దీనికి ముందు ఆయన నేవీ, జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నేవీ కెప్టెన్లు టీఆర్‌ఎస్‌ కుమార్‌, వినోత్‌ తివారీ, కమాండర్‌ కిశోర్‌, లెఫ్టినెంట్‌ కమాండర్లు పి.మోహంత్‌ నాయుడు, నరేశ్‌, ఏడీసీ రమణమూర్తి, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్యాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 01:14 AM