Share News

సీఎం పాడేరు పర్యటన ఖరారు

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:03 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాడేరు మండల పర్యటన దాదాపుగా ఖరారైంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు.

సీఎం పాడేరు పర్యటన ఖరారు
హెలీప్యాడ్‌ ప్రదేశంలో ఏర్పాట్లపై సీఎం పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్‌కు వివరిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

వంజంగి గ్రామ సమీపంలో కాఫీ రైతులతో చంద్రబాబు ముఖాముఖి

అక్కడికి సమీపంలో బహిరంగ సభ

కస్తూర్బా గాంధీ విద్యాలయం వద్ద కూటమి కార్యకర్తలతో చిట్‌చాట్‌

పాడేరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాడేరు మండల పర్యటన దాదాపుగా ఖరారైంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం ఈ నెల 9న పాడేరు మండలం వంజంగి గ్రామానికి ఆనుకుని ఉన్న కాఫీ తోటల్లో పలువురు గిరిజన రైతులతో ముచ్చటిస్తారు. అనంతరం లగిశపల్లి, ఉగ్గంగొయ్యి గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడతారు. సీఎం పాడేరు పర్యటన నేపథ్యంలో అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్‌ బుధవారం ఇక్కడికి వచ్చారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమన్వయకర్త దిశానిర్దేశం

పాడేరు మండలం లగిశపల్లి పంచాయతీ వంజంగి గ్రామానికి చేరువగా ఉన్న కాఫీ తోటలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందర్శించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్‌ బుధవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. లగిశపల్లి గ్రామ సమీపంలో హెలీప్యాడ్‌ నిర్మించాలని, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సీఎం వంజంగిలోని కాఫీ తోటలుండే ప్రాంతాన్ని సందర్శిస్తారన్నారు. అలాగే ఆయా ప్రదేశాలను ఆయన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తరువాత గిరిజనులతో బహిరంగ సభ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించి, సభకు వచ్చే జనాలకు, అతిథుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే అదే మార్గంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎదురుగా ప్రదేశంలో కూటమి నేతలు, కార్యకర్తలతో సీఎం భేటీ కానున్నారని నేతలు తెలిపారు. హెలీప్యాడ్‌ నుంచి వంజంగి గ్రామానికి వెళ్లే మార్గాన్ని రెండు రోజుల్లో మెరుగుపరచడంతోపాటు మరో రెండు రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ షెహబాజ్‌ అహ్మద్‌, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

అధికారుల మల్లగుల్లాలు

అరకులోయ: సీఎం చంద్రబాబునాయుడు పర్యటనపై అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. అరకులోయలో సీఎం పర్యటన ఉంటుందని భావించి జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఎస్పీ, డీఎస్పీ తదితరులు స్థానిక సర్పంచ్‌ దాసుబాబుతో కలిసి సిమిలిగుడ, గద్యాగుడ, గరడగుడ, పెదగంగు గుడి, గంజాయిగుడ గ్రామాలను రెండు రోజులుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వరి పంట పొలాలతో పాటు కాఫీ తోటలను పరిశీలించిన అనంతరం సభా వేదికకు చేరుకుంటారని సీఎం కార్యాలయం నుంచి సమాచారం రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సభా వేదిక వద్దకు లారీల్లో సామగ్రిని తీసుకువచ్చారు. అయితే సీఎం పర్యటన పాడేరులో ఉంటుందని స్పష్టత రావడంతో సామగ్రిని అక్కడికి తరలించారు.

Updated Date - Aug 06 , 2025 | 11:03 PM