Share News

నేడు సీఎం పాడేరు రాక

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:00 AM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి బిడ్డలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం పాడేరు రానున్నారు.

నేడు సీఎం పాడేరు రాక

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి బిడ్డలతో మమేకం

పాడేరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి బిడ్డలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం పాడేరు రానున్నారు. ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు లగిశపల్లిలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి 10.25 గంటలకు వంజంగి గ్రామానికి వెళతారు. అక్కడ 11.40 గంటల వరకు గిరిజన సంప్రదాయాలు, పండగలపై గిరిజనులతో, కాఫీ తోటల్లో రైతులతో ముచ్చటిస్తారు. ఆ తరువాత ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.05 గంటల వరకు ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం లగిశపల్లికి సమీపంలో కూటమి నేతలు, కార్యకర్తలతో 2.20 గంటల వరకు సమావేశమవుతారు. అనంతరం హెలీకాప్టర్‌లో గన్నవరం బయలుదేరి వెళతారు.


సంక్షేమ హాస్టళ్లకు ర్యాంకులు

మెరుగైన ఫలితాల సాధనకు ప్రభుత్వ యత్నం

ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు

ఆరు అంశాల్లో పనితీరును పరిగణలోకికి తీసుకుని ర్యాంకులు కేటాయింపు

సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాలకు వర్తింపు

పిల్లలకు రాయడం, చదవడం, లెక్కలు నేర్పించేందుకు వలంటీర్ల నియామకం

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాల మధ్య పోటీతత్వాన్ని పెంచి మెరుగైన ఫలితాలను సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే వసతి గృహాల పనితీరును బట్టి ర్యాంకులు ఇవ్వాలని ని ర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేసి, వచ్చే ఏడాది ర్యాంకులను ప్రకటించనున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆరు పారామీటర్స్‌ను విడుదల చేసింది. జిల్లాలోని సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలకు చెందిన అధికారులకు ఈ సమాచారాన్ని అందించింది.

ప్రభుత్వం సూచించిన ఆరు అంశాలకు వంద మార్కులను కేటాయించింది. అకడమిక్‌ పెర్‌ఫార్మెన్స్‌కు 40 మార్కులు (ఇందులో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులందరి ప్రగతికి 20 మార్కులు, అద్భుతమైన ఫలితాల సాధనకు మరో 20 మార్కులు) ఉంటాయి. అలాగే, విద్యార్థుల హాజరు, రిటెన్షన్‌కు ఐదు చొప్పున పది మార్కులను కేటాయించారు. అలాగే, మెనూ అమలుకు పది మార్కులను కేటాయించారు. ఇందులో మెనూ ప్రదర్శనకు రెండు, అమలుకు ఎనిమిది మార్కులు ఉంటాయి. హాస్టల్‌లో అనుకోని విధంగా ఏవైనా ఘటనలు జరిగి విద్యార్థులు ఇబ్బందిపడితే వాటికి స్పందించడం, ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారాన్ని ఇవ్వడానికి మరో ఐదు మార్కులను కేటాయించారు. పరిశుభ్రత, పచ్చదనం, శానిటేషన్‌ నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు మరో ఐదు మార్కులను కేటాయించారు. అదేవిధంగా ఆరో కేటగిరీలో తప్పక నిర్వహించాల్సిన అంశాలుగా పేర్కొంటూ 30 మార్కులు కేటాయించారు. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహణకు నాలుగు, ఆరోగ్య పరీక్షల నిర్వహణకు నాలుగు, పీ4 ప్రోగ్రామ్‌లో భాగంగా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల నిర్వహణ, వనరుల సమీకరణకు మరో నాలుగు మార్కులు, క్రమశిక్షణ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినందుకు ఆరు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌, ఇన్నోవేషన్‌కు నాలుగు, హాస్టళ్లపై పత్రికల్లో వచ్చే కథనాలకు అధికారుల వివరణకు రెండు మార్కులను కేటాయించారు. ఆరు అంశాల్లో సాధించిన మార్కులను బట్టి హాస్టళ్లకు రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులు ప్రకటించనున్నారు.

వందలాది మంది విద్యార్థులు

జిల్లాలోని బీసీ, సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన వసతి గృహల్లో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 23 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది ప్రీ మెట్రిక్‌, మరో 15 పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు. వీటిలో 1,720 సీట్లు ఉండగా, ప్రస్తుతం 1011 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 509 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ ప్రవేశాలు పూర్తయ్యే నాటికి సీట్లన్నీ భర్తీ అవుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 12 ప్రీ మెట్రిక్‌, 16 పోస్టు మెట్రిక్‌ హాస్టల్స్‌ ఉన్నాయి. ఇందులో 1,800 సీట్లు ఉండగా, ఇప్పటికే 1644 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 156 మాత్రమే ఖాళీ ఉన్నాయి.

వసతి గృహాలకు వలంటీర్లు

ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు రాయడం, చదవడం, లెక్కలు చేయడం వంటివి నేర్పించేందుకు వలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌కు ఒక్కో వలంటీర్‌ను నియమించ నున్నారు. రూ.5 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లించనున్నారు.

పోటీతత్వంతో మెరుగైన ఫలితాలు

- కె.రామారావు, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్‌

వసతి గృహాల మధ్య పోటీని పెంచడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. యూనివర్సిటీలు, కాలేజీలకు ఇస్తున్న మాదిరిగానే వసతి గృహాలకు ర్యాంకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మెరుగైన ఫలితాల సాధనకు దోహదం చేస్తుంది. ఇది హాస్టల్‌కు ర్యాంకు అనడం కంటే వార్డెన్‌కు ఇచ్చే ర్యాంకుగా భావించాల్సి ఉంటుంది. వార్డెన్లు అంకితభావంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించి పేరు పొందేందుకు ఇది ఉపకరిస్తుంది.


పేలుడుపై దర్యాప్తు

ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన

ఫోరెన్సిక్‌ సైన్స్‌, క్లూస్‌ టీమ్‌లు

పేలుడుకు సిలిండర్లు కారణం కాదని నిర్ధారణ

మహారాణిపేట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని బుక్కావారి వీధిలో గురువారం సాయంత్రం సంభవించిన పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం పోలీస్‌ విభాగానికి చెందిన బాంబ్‌ స్క్వాడ్‌, రీజనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగం, క్లూస్‌ టీమ్‌ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు సంబంధించి వివిధ శకలాలను, మట్టిని సేకరించారు. పేలింది గ్యాస్‌ సిలిండర్‌ కాదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఒక తెల్లని ఇనుప డబ్బా వంటి వస్తువు తన వద్దకు రావడంతో స్ర్కాప్‌ షాపు యజమాని రంగారావు దానిని ఓపెన్‌ చేయాల్సిందిగా కోరుతూ పక్కనున్న వెల్డింగ్‌ షాపు యజమాని గణేష్‌కుమార్‌కు ఇచ్చారు. దానిని తెరిచే క్రమంలోనే భారీ పేలుడు సంభవించినట్టు తెలిసింది. వెల్డింగ్‌ షాపులో ఉన్న గ్యాస్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు యథావిధిగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం వివరాలను సేకరించి తమతో తీసుకువెళ్లారు.

ఇదిలావుండగా గణేష్‌, మైఖేల్‌ పీటర్‌ అలియాస్‌ శ్రీనివాస్‌, ముత్యాలనాయుడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం వారి కుటుంబీకులకు అందజేశారు. ఇక ఈ ఘటనలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

సొంతంగా వెల్డింగ్‌ షాపు పెట్టుకొని మరికొందరికి ఉపాధి కల్పిస్తూ సంతోషంగా ఉన్నామని, భగవంతుడు ఈ విధంగా అన్యాయం చేస్తాడని అనుకోలేదని గణేష్‌ భార్య సుధా మార్చురీ వద్ద భోరున విలపించింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనలో చనిపోయిన చింతకాయల ముత్యాలు కుటుంబం బుక్కా వీధిలోనే నివాసం ఉంటున్నది. ముత్యాలుకు భార్య (ప్రమీల), ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 01:00 AM