జిల్లా అధికారులకు సీఎం అభినందనలు
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:37 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలో ఈ నెల 21న నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారులను సీఎం చంద్రబాబునాయుడు సోమవారం అమరావతిలో అభినందించారు.
యోగా గిన్నిస్ రికార్డు పత్రం అందజేత
విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలో ఈ నెల 21న నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారులను సీఎం చంద్రబాబునాయుడు సోమవారం అమరావతిలో అభినందించారు. శనివారం ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 3,03,654 మంది యోగాలో పాల్గొన్నారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. ఈ రెండింటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ‘గిన్నిస్’ రికార్డు పత్రాలను ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో సోమవారం అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖపట్నం, అల్లూరి జిల్లాల అధికారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టర్ హరేంధిరప్రసాద్, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్‌లతో పాటు విశాఖ పోలీస్ కమిషనర్ శంకర భ్రత బాగ్చిలను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హోం శాఖ మంత్రి అనిత, ఐటీ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.