ఐసీడీఎస్ పీడీ, సీడీపీవోలకు సీఎం అవార్డులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:53 PM
మొంథా తుఫాన్ సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన అల్లూరి జిల్లా ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, పెదబయలు సీడీపీవో స్రవంతిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.
మొంథా తుఫాన్ సమయంలో
ఐదుగురు గర్భిణులకు ఆస్పత్రికి తరలింపు
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా
అందుకున్న మెమోంటోలు, ప్రశంసాపత్రాలు
పెదబయలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన అల్లూరి జిల్లా ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, పెదబయలు సీడీపీవో స్రవంతిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొంథా తుఫాన్ ఫైటర్లను ఆయన మెమోంటోఉ, ప్రశంసాపత్రాలతో సన్మానించారు.తుఫాన్ సమయంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను ముందుగా పాడేరు జిల్లా ఆస్పత్రికి ఐసీడీఎస్ అధికారులు తరలించారు. రవాణా వ్యవస్థ సక్రమంగా లేని అక్టోబరు 29వ తేదీన మండలంలోని అతి మారుమూల గ్రామమైన గిన్నెలకోట పంచాయతీ కొర్జంగి గ్రామానికి చెందిన బచ్చెలి మహాలక్ష్మి అనే గర్భిణిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించడంతో అక్టోబరు 30న ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతోనే తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అలాగే శివారు గ్రామాలైన కన్నెలకట్టు, కొడంబంధ, బంగారుపుట్టు గ్రామాల నుంచి నలుగురు గర్భిణులను సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో సుఖ ప్రసవాలు జరిగాయి. ఐసీడీఎస్ శాఖ సమిష్టిగా కృషి చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి శనివారం తుఫాన్ వారియర్స్ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, సీడీపీవో జె. స్రవంతిలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసాపత్రాన్ని ఇచ్చి అభినందించారు.