Share News

చకచకా ఫైళ్ల క్లియరెన్స్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:26 AM

పాలనలో ఈ-గవర్నెన్స్‌కు పెద్దపీట వేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జిల్లా స్థాయిలోనూ అదే తరహాలో సాగాలని సూచిస్తున్నారు.

చకచకా ఫైళ్ల క్లియరెన్స్‌

మూడు నెలల్లో 329 ఫైళ్లు క్లియర్‌ చేసిన కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌

ఒక్కటి మాత్రమే పెండింగ్‌

ఒక్కో ఫైల్‌ పరిష్కారానికి సగటున రెండు రోజుల 16 గంటల 40 నిమిషాలు సమయం

1,406 ఫైళ్లు క్లియర్‌ చేసిన జేసీ

సగటున ఒకరోజు ఆరు గంటల 21 నిమిషాల సమయం

విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

పాలనలో ఈ-గవర్నెన్స్‌కు పెద్దపీట వేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జిల్లా స్థాయిలోనూ అదే తరహాలో సాగాలని సూచిస్తున్నారు. సంప్రదాయ విధానానికి తెరదించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ దిశగా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర అశోక్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీ నుంచి ఈనెల తొమ్మిదో తేదీ అంటే మూడు నెలల కాలంలో సగటున ఒక ఫైలు క్లియరెన్స్‌కు కలెక్టర్‌ రెండు రోజుల 16 గంటల 40 నిమిషాలు తీసుకోగా, జేసీ ఒకరోజు ఆరు గంటల 21 నిమిషాలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం మంత్రులు, సీనియర్‌ అధికారుల సమీక్షలో జిల్లాల వారీగా కలెక్టర్లు, జేసీల ఫైళ్ల క్లియరెన్స్‌ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీ నాటికి కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ లాగిన్‌లో 18 ఫైల్స్‌ ఉండగా, ఆ రోజు నుంచి డిసెంబరు తొమ్మిదో తేదీ వరకూ 312 వచ్చాయి. వీటిలో 329 క్లియర్‌ (మొత్తం 330) చేయగా, ఒకటి పెండింగ్‌లో ఉంది. అదే గత ఏడాది జూలై 15 నాటికి 55 ఫైళ్లు ఉండగా, ఆ రోజు నుంచి డిసెంబరు తొమ్మిది వరకూ 1711 ఫైళ్లు రాగా...వాటిలో 1764 క్లియర్‌ (మొత్తం 1,766) చేశారు. రెండు ఫైళ్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 9వ తేదీ నుంచి ఈనెల తొమ్మిది వరకూ మూడు నెలల కాలంలో ఫైల్‌ క్లియరెన్స్‌కు సగటున రెండు రోజుల 16 గంటల 40 నిమిషాల సమయం తీసుకున్నారు. అదే గత ఏడాది జూలై 15 నుంచి ఈ నెల తొమ్మిది వరకు చూస్తే ఐదు రోజుల 13 గంటల నాలుగు నిమిషాలు పట్టింది. జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ వద్ద సెప్టెంబరు తొమ్మిదో తేదీ నాటికి 27 ఫైళ్లు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈనెల తొమ్మిది వరకు 1,458 ఫైళ్లు వచ్చాయి. మొత్తం 1,485 అయ్యాయి. అందులో 1,406 ఫైళ్లు పరిష్కరించగా, ఇంకా 79 పెండింగ్‌లో ఉండిపోయాయి. గత ఏడాది జూలై 15 నాటికి 23 ఫైళ్లు ఉండగా, అప్పటి నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు 5,202 ఫైళ్లు రాగా 5,146 క్లియర్‌ చేశారు. జేసీ ఫైలు క్లియర్‌ చేయడానికి సగటున ఒకరోజు ఆరు గంటల 21 నిమిషాల సమయం తీసుకున్నారు. గత ఏడాది నుంచి చూస్తే రెండు రోజుల తొమ్మిది గంటల 15 నిమిషాలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు అంటే వివిధ కోర్టు కేసులు ఉన్నవి లేదా సీఎంకు ఇచ్చిన నివేదిక తయారుచేసే సమయంలో వచ్చినవి అయి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని శాఖల్లో ఈఫైల్‌ విధానం అమలులో ఉంది. అయితే ఎక్కువగా కలెక్టర్‌, జేసీ స్థాయిలో ఈ ఫైళ్లు ఎక్కువగా రన్‌ చేస్తుంటారు. కలెక్టరేట్‌లో జూనియర్‌/సీనియర్‌ అసిస్టెంట్‌ వద్ద ప్రారంభమైన ఈ ఫైల్‌ వరుసగా సెక్షన్‌ సూపరింటెండెంట్‌, డీఆర్‌వో, జేసీ, కలెక్టర్‌ వరకూ వెళుతుంది. కొన్ని జేసీ స్థాయిలో క్లియర్‌ అవుతుండగా, మరికొన్ని కలెక్టర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకుంటున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 01:27 AM