స్వచ్ఛతా నహీ సేవా
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:48 AM
మండల కేంద్రంలో ‘స్వచ్ఛతా హీ సేవా’ నిర్వహణ మొక్కుబడిగా సాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, రహదారుల పక్కన పిచ్చిమొక్కలు పీకేసి, చెత్తాచెదారాన్ని తొలిస్తున్నారు. కానీ పంచాయతీలో జన ఆవాసాల మధ్య కొనసాగుతున్న డంపింగ్ యార్చు గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు అన్ని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
రావికమతంలో అధ్వానంగా పారిశుధ్యం
ఆవాసాల పక్కనే అనధికార డంపింగ్ యార్డు
చెత్తాచెదారం కుళ్లిపోయి దుర్వాసన
పందులు, దోమలు, ఈగల బెడదతో స్థానికులు ఇక్కట్లు
రావికమతం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ‘స్వచ్ఛతా హీ సేవా’ నిర్వహణ మొక్కుబడిగా సాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, రహదారుల పక్కన పిచ్చిమొక్కలు పీకేసి, చెత్తాచెదారాన్ని తొలిస్తున్నారు. కానీ పంచాయతీలో జన ఆవాసాల మధ్య కొనసాగుతున్న డంపింగ్ యార్చు గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు అన్ని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. వీధుల్లో, ఖాళీ స్థలాల్లో పేరుకు పోయిన చెత్తాచెదారం తొలగింపజేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఇందులో భాగంగా శనివారం ఎంపీడీవో మహేశ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తుప్పల తొలగించి, చెత్తాచెదారాన్ని సేకరించారు. కానీ ప్రధాన మైన తహశీల్దారు కార్యాలయం, ఎస్సీ కాలనీ మధ్యన వున్న అనధికార డంపింగ్ యార్డులో చెత్తను తొలగించడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గ్రామంలోని వీధుల్లో సేకరించిన చెత్తను పారిశుధ్య సిబ్బంది రోజూ ఇక్కడ పడేస్తున్నారు. వర్షాలకు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది. పందులు, కుక్కలు, దోమలు, ఈగలకు ఇది ఆవాసంగా మారి, పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. ఇక్కడ చెత్త వేయవద్దని పంచాయతీ అధికారులకు పలుమార్లు చెప్పినా.. స్థల సమస్య వుందంటూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా చెత్త సమస్యపై పంచాయతీ కార్యదర్శి కృష్ణమోహన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఇక్కడ డంపింగ్ యార్డుకు స్థల సమస్య చాలా కాలం నుంచి వుందని, దీంతో తహశీల్దారు కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలో చెత్తను పడేయాల్సి వస్తున్నదని అన్నారు. ఇక్కడ చెత్త వేయడం వల్ల ఎస్సీ కాలనీ వాసులతోపాటు ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడడం వాస్తవమేన్నన్నారు. డంపింగ్ యార్డులకు స్థల సమస్య త్వరలోనే తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.