Share News

స్వచ్ఛ విశాఖ

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:52 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2024లో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక కేటగిరీలో మినిస్టీరియల్‌ అవార్డు లభించింది.

స్వచ్ఛ విశాఖ

  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీకి జాతీయ స్థాయి మినిస్టీరియల్‌ అవార్డు

  • 19న ఢిల్లీలో అధికారికంగా ప్రకటన

విశాఖపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి):

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2024లో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక కేటగిరీలో మినిస్టీరియల్‌ అవార్డు లభించింది. ఢిల్లీలో ఈనెల 19న స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్నది. అదేరోజు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. కాగా ఢిల్లీలో 19న జరిగే అవార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాలంటూ జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావులకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల నుంచి ఆహ్వానం అందింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలను నిర్వహిస్తోంది. అయితే ఏటా మాదిరిగా కాకుండా ఈ ఏడాది భిన్నంగా నిర్వహించింది. జాతీయ స్థాయిలో ఏటా మూడు నగరాలే మొదటి మూడు స్థానాలను దక్కించుకుంటుండడంతో వాటిని ఈ ఏడాది పోటీ నుంచి మినహాయించారు. దీంతో పది లక్షలకు పైబడిన జనాభా కేటగిరీ నగరాల్లో విశాఖకు ఒకటి లేదా రెండో ర్యాంకు దక్కుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.పట్టాభిరామ్‌ శనివారం నగర పర్యటనకు వచ్చినప్పుడు జీవీఎంసీకి ప్రత్యేక కేటగిరీలో మినిస్టీరియల్‌ అవార్డు లభించిందని ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్‌ అవార్డు రాజమండ్రికి, పది లక్షల జనాభా పైబడిన కేటగిరీలో విజయవాడ, మూడు లక్షలు పైబడిన జనాభా కేటగిరీలో గుంటూరు, మూడు లక్షలలోపు జనాభా గల నగరాల కేటగిరీలో తిరుపతి సూపర్‌ స్వచ్ఛ లీగ్‌ అవార్డులు గెలుచుకున్నాయన్నారు. ఏ నగరానికి ఏ ర్యాంకు లభించింది?, కేటగిరీ వారీగా ఎన్నిమార్కులు వచ్చాయనే వివరాలను వెల్లడించలేదు. 19న పూర్తివివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని జవీఎంసీ అధికారులు చెబుతురు.

Updated Date - Jul 13 , 2025 | 12:52 AM