మేడివాడలో రైతుల మధ్య ఘర్షణ, కొట్లాట
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:31 AM
పంట భూమిలో నుంచి ట్రాక్టర్ వెళ్లిన విషయమై రైతుల మధ్య గొడవ జరిగి కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ ఎం.రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి.

నలుగురికి గాయాలు
రావికమతం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పంట భూమిలో నుంచి ట్రాక్టర్ వెళ్లిన విషయమై రైతుల మధ్య గొడవ జరిగి కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ ఎం.రఘువర్మ తెలిపిన వివరాలిలా వున్నాయి. మండలంలోని మేడివాడ గ్రామానికి చెందిన కేశంశెట్టి శేషు, గణేశ్‌లకు, ఇదే గ్రామానికి చెందిన సీతిన శ్రీను, సంజీవరావులకు దిడ్డి, బాదనపాడు రెవెన్యూ పరిధిలో పక్క పక్కనే వ్యవసాయ భూములు వున్నాయి. వ్యవసాయ పనుల నిమిత్తం శ్రీను, సంజీవరావు గురువారం ఉదయం శేషు, గణేశ్‌లకు చెందిన నువ్వు పొలంలో నుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. తమను అడగకుండా పంట పొలంలో నుంచి ట్రాక్టర్ ఎందుకు తీసుకెళ్లారంటూ శేషు, గణేశ్ నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. దీంతో నలుగురికీ గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రావికమతం పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. ఈ సంఘటనపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
సీజ్ చేసిన ఎక్సైజ్ వాహనాల దగ్ధం
నర్సీపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డు పక్కన ఎక్సైజ్ శాఖ అధికారులు వుంచిన రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. గంజాయి, మద్యం కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను స్టేషన్ ఆవరణలో ఉంచడానికి ఖాళీ స్థలం లేకపోవడంతో చింతపల్లి వెళ్లే రోడ్డులో 26 వాహనాలు ఉంచారు. వీటి పక్కన ఉన్న పొలంలో ఎండిపోయిన గడ్డికి గురువారం మధ్యాహ్నం రైతులు నిప్పు పెట్టారు. ఈ సమయంలో గాలి అధికంగా వీచడంతో మంటలు వాహనాలకు వ్యాపించాయి. దీనిని గమనించిన ఎక్సైజ్ ఎస్‌ఐ స్థానిక అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి అప్పలస్వామి సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే ఒక జీప్, వ్యాన్ దగ్ధమయ్యాయి.
బైక్‌ను ఢీకొన్న వ్యాన్.. యువకుడి మృతి
పాడేరురూరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఘాట్ రోడ్డులో మండలంలోని మినుములూరు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ అందించిన వివరాల ప్రకారం.. హుకుంపేట మండలం గొందిరాప గ్రామానికి చెందిన సోమెలి వెంకటరమణ (26) విశాఖపట్నంలోని షిప్‌యార్డ్‌లో అప్రంటీస్ చేస్తున్నాడు. గురువారం ఉదయం విశాఖ నుంచి బైక్‌పై గొందిరాప వస్తున్నాడు. మినుములూరు సమీపంలోని మొదటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొన్నది. దీంతో వెంకటరమణ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంపై అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనుమానాస్పదంగా ఒకరి మృతి
నక్కపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నల్లమట్టిపాలెం గ్రామానికి చెందిన నల్లమట్టి రాము(54) రాజయ్యపేట గ్రామ సమీపాన అనుమానాస్పదంగా మృతి చెందినట్టు అతని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం రాము కల్లు తాగేందుకు రాజయ్య వెళ్లాడని, రాత్రి ఇంటికి రాలేదని, గురువారం ఉదయం రాజయ్యపేట సమీపాన కల్లుపాకల వద్ద చనిపోయివున్నాడని ఎస్‌ఐ చెప్పారు. రాము కుమారుడు దుర్గా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష
నక్కపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురికి ఎలమంచిలి ఏజేఎఫ్‌సీ కోర్టు గురువారం నాలుగు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్టు సీఐ కె.కుమారస్వామి చెప్పారు. బుధవారం హైవేపై డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా కె.కోటపాడుకు చెందిన ఎం.శ్రీను,నాతవరం మండలం నడుంపాలెంకు చెందిన గుర్రాల చిన అప్పన్న, ఉపమాకకు చెందిన గొర్ల సువర్ణరాజును పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. గురువారం ఎలమంచిలి కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికీ నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్టు సీఐ చెప్పారు.
్ఠ20 లీటర్ల సారా స్వాధీనం : ఇద్దరి అరెస్టు
పాయకరావుపేట రూరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గుంటపల్లి గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు గురువారం విస్తృత దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 20 లీటర్ల సారా, 200 లీట్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకు న్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ సీఐ జి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నవోదయ 2.0లో భాగంగా విశాఖపట్నం ఎన్‌ఫోర్స్‌మెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పి.అప్పారావు దత్తత తీసుకున్న పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో ఆయన ఎక్సైజ్ సిబ్బందితో దాడులు నిర్వహించగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 20 లీటర్ల నాటుసారా, 200 లీటర్ల బెల్లం ఊటతో పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్‌కి తరలించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ పి.అప్పారావుతోపాటు సిబ్బంది జి.అప్పారావు, ఆర్.జగన్నాథ్, జె.నాగప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
అధిక లోడుతో వెళుతున్న రెండు లారీలకు జరిమానా
అనకాపల్లి టౌన్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అధిక లోడుతో మెటల్ రవాణా చేస్తున్న రెండు లారీలకు బుధవారం సాయంత్రం జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ గురువారం తెలిపారు. కూండ్రం రోడ్డులోంచి రెండు లారీలు కొత్తూరు జంక్షన్‌లోని హైవేకు భారీ లోడుతో వెళుతుండగా తనిఖీ చేసి ఒక లారీకి రూ. 58వేలు, మరో లారీకి రూ. 68 వేలు జరిమానాలు విధించినట్టు ఆయన తెలిపారు.