Share News

ప్రైవేటు సేవలో క్లాప్‌ వాహనాలు

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:26 AM

నగరంలో కొంతమంది క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) వాహనాల సిబ్బంది తమకు కేటాయించిన వార్డులో వదిలేసి, డబ్బుల కోసం ప్రైవేటు ఫంక్షన్ల నుంచి చెత్తను యార్డుకు తరలించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది పారిశుధ్య నిర్వహణపై ప్రభావం చూపుతోంది. ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ గాజువాక ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ తరహా వ్యవహారం బయటపడడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రైవేటు సేవలో  క్లాప్‌ వాహనాలు

ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణపై నిర్లక్ష్యం

ఫంక్షన్లలో చెత్త సేకరణకు ప్రాధాన్యం

నిర్వాహకులతో ఒప్పందం

అదనపు ఆదాయం కోసం సిబ్బంది కక్కుర్తి

నగరంలో పారిశుధ్యంపై ప్రభావం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో కొంతమంది క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) వాహనాల సిబ్బంది తమకు కేటాయించిన వార్డులో వదిలేసి, డబ్బుల కోసం ప్రైవేటు ఫంక్షన్ల నుంచి చెత్తను యార్డుకు తరలించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది పారిశుధ్య నిర్వహణపై ప్రభావం చూపుతోంది. ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ గాజువాక ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ తరహా వ్యవహారం బయటపడడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

జీవీఎంసీ పరిధిలోని 574 వార్డు సచివాలయాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు ఒక్కో క్లాప్‌ వాహనాన్ని నగర పాలక సంస్థ సమకూర్చింది. క్లాప్‌ వాహనం డ్రైవర్‌, లోడర్‌ కలిసి ఇంటింటికీ వెళ్లి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. వాహనం ఫుల్‌ అయిన తర్వాత దానిని సమీపంలో ఎంఎస్‌ఎఫ్‌ (యార్డు)కు తరలించాలి. ఇలా వార్డు సచివాలయ పరిధిలోని అన్ని ఇళ్లను కవర్‌ చేసేలా ప్రతిరోజూ మూడు ట్రిప్పులు తిరగాల్సి ఉంటుంది. ఇలాచేయడం వల్ల రోడ్లపై చెత్త కనిపించకుండా నగరం పరిశుభ్రంగా ఉంటుందనేది అధికారుల భావన. అయితే కొంతమంది క్లాప్‌ వాహనాల సిబ్బంది ఎక్కడైనా ఫంక్షన్లు, ప్రైవేటు కార్యక్రమాలు జరిగితే అక్కడి చెత్తను బయటకు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సాధారణ విధులను పక్కనపెట్టేస్తున్నారు. క్లాప్‌ వాహనాల సిబ్బంది ఇలా చేయడం వల్ల ఆ సచివాలయ పరిధిలోని ఇళ్లలో చెత్త సేకరణ నిలిచిపోతోంది. దీంతో వారంతా చెత్తను రోడ్డుపైకి తెచ్చి పడేస్తున్నారు. దీనివల్ల రోడ్లతోపాటు గెడ్లలు చెత్తమయంగా తయారవుతున్నాయి.

ప్రైవేటు ఫంక్షన్‌లో చెత్తవాహనం చూసి అవాక్కయిన కమిషనర్‌

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా ఇటీవల గాజువాక వెళ్లారు. అధికారులతో కలిసి నడుచుకుంటూ వెళుతున్న కమిషనర్‌కు ఒక ప్రైవేటు ఫంక్షన్‌ జరిగినచోట క్లాప్‌ వాహనం కనిపించడంతో ఆగి పరిశీలించారు. ముందురోజు రాత్రి జరిగిన ఫంక్షన్‌లో పోగైన చెత్తను క్లాప్‌ వాహనం సిబ్బంది ఏరి వాహనంలో వేస్తున్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లారు. సిబ్బందిని పిలిచి ఏ వార్డు సచివాలయ పరిధిలో తిరిగే వాహనమని ప్రశ్నించారు. ఇళ్లకు వెళ్లి చెత్త సేకరించడం మానేసి, ప్రైవేటు ఫంక్షన్‌లో చెత్తను తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్లాప్‌ వాహనాల సిబ్బంది కొందరు ఇలా చేస్తున్నారని ఆయన వెంట ఉన్న అధికారి ఒకరు చెప్పడంతో ఇకపై పర్యవేక్షించే బాధ్యతను వార్డు శానిటేషన్‌ కార్యదర్శులకు అప్పగించాలని అఽధికారులను ఆదేశించారు.

శానిటేషన్‌ సెక్రటరీలకు వాహనాల పర్యవేక్షణ బాధ్యత

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

కొందరు క్లాప్‌ వాహనాల సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించకపోవడంతో పర్యవేక్షణ బాధ్యతను వార్డు శానిటేషన్‌ కార్యదర్శులకు అప్పగించాం. ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు వార్డు సచివాలయానికి వెళ్లి కార్యదర్శులు హాజరువేసుకోవాలి. తర్వాత ఏదో ఒక వాహనం వెంట వెళ్లి ఇంటింటికీ చెత్త సేకరణ ఎలా జరుగుతుందనేని స్వయంగా పరిశీలించాలి. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అధికారుల గ్రూపులో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించాం. దీనివల్ల నగరంలో క్లాప్‌ వాహనాలు పక్కాగా చెత్త సేకరణ జరుపుతాయి. తద్వారా నగరంలో పారిశుధ్యం మెరుగుపడుతుంది.

Updated Date - Sep 19 , 2025 | 01:26 AM