Share News

నగరం సర్వాంగ సుందరం

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:37 AM

పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

నగరం సర్వాంగ సుందరం

సీఐఐ సదస్సుకు ముస్తాబు

రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు

26 రూట్లలో కొత్తరోడ్లు, ఫుత్‌పాత్‌లు, సెంటర్‌ మీడియన్లకు మరమ్మతులు

పచ్చదనం పెంపు

అతిథులు ప్రయాణించే మార్గాల్లోని కూడళ్లు అభివృద్ధి

16 బస్‌బేల ఆధునికీకరణ

జీరో వేస్ట్‌ ఈవెంట్‌గా నిర్వహణకు జీవీఎంసీ ఏర్పాట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీవీఎంసీ అధికారులు సుమారు రూ.40 కోట్లు వెచ్చించి, అనేక అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టారు. వాటన్నింటినీ మంగళవారం నాటికి పూర్తిచేయడంతో నగరం కొత్తకళను సంతరించుకుంది.

నగరంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈనెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు నిర్వహించాలని మూడు నెలల కిందట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రాంగణం పరిసరాలను, రహదారులను సుందరంగా తయారుచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, నగర ప్రజాప్రతినిధులు పలుమార్లు భేటీ అయి సదస్సు కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి కార్యాచరణ రూపొందించారు. ప్రతినిధులు ప్రయాణించే మార్గాలు, సదస్సు అనంతరం సందర్శించే ప్రాంతాలు, వాటికి వెళ్లే మార్గాలను అభివృద్ధి చేయాలని, పచ్చదనం పెంపొందించాలని, పెయింటింగ్‌ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం జీవీఎంసీ రూ.40 కోట్లు వరకూ కేటాయించింది. సదస్సు కోసం వచ్చే ప్రతినిధులు ప్రయాణించే మార్గాలను ఐదు కేటగిరీలుగా విభజించిన అధికారులు, 26 మార్గాల్లో 9.5 కిలోమీటర్ల మేర కొత్తగా బీటీ లేయర్‌ను వేశారు. 26.2 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం, రిపేర్లు, పెయింటింగ్‌ పనులు చేపట్టారు. 57 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా కెర్బ్‌లు, సెంటర్‌ మీడియన్‌ల నిర్మాణం, రిపేర్లు, పెయింటింగ్‌లు పూర్తిచేశారు. 34.6 కిలోమీటర్లు పొడవున జాతీయ రహదారి, బీఆర్‌టీఎస్‌, నగర పరిధిలోని ప్రధాన మార్గాల్లో సెంటర్‌ మీడియన్ల రిపేర్లు, పెయింటింగ్‌ చేపట్టారు. 15 కిలోమీటర్లు పొడవున రోడ్లపై సెంటర్‌ మీడియన్లలో కొత్తగా గ్రిల్స్‌ ఏర్పాటుచేశారు. నగరంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న గోడలపై 6.9 కిలోమీటర్లు మ్యూరల్‌ ఆర్ట్‌లు, ఆలోచించేలా పెయింటింగ్‌లు వేశారు. 41 కిలోమీటర్లు పొడవున రోడ్లపై లేన్‌మార్కింగ్‌ చేశారు. నగర పరిధిలోని 16 బస్‌బేలను ఆధునికీకరించారు. కొత్తగా ఏడు వేల వీధి దీపాలను వేయడంతోపాటు ఆర్కే బీచ్‌ పరిసరాల్లో సముద్రతీరం, సముద్రపు అలలు సందర్శకులకు రాత్రిపూట కూడా స్పష్టంగా కనిపించేలా వెయ్యి వోల్టుల సామర్థ్యం కలిగిన హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటుచేశారు. బీచ్‌రోడ్డుతోపాటు నగర పరిధిలోని ముఖ్యమైన రోడ్లు, సెంటర్‌ మీడియన్లు, కూడళ్లలో ఆకట్టుకునేలా అందమైన పూలమొక్కలను నాటి పచ్చదనం అభివృద్ధి చేశారు. నగరంలోని ముఖ్యమైన రోడ్లపై ఉన్న కూడళ్లలో సర్కిల్స్‌ను నిర్మించి వాటిలో వాటర్‌ ఫౌంటెయిన్లు, ఆకట్టుకునేలా కళాకృతులను ఏర్పాటుచేశారు. వీటన్నింటి నేపథ్యంలో నగరానికి కొత్తశోభ వచ్చి రాత్రిపూట మరింత అందంగా కనిపిస్తోంది.

జీరో వేస్ట్‌ ఈవెంట్‌గా గుర్తింపు కోసం జీవీఎంసీ కార్యాచరణ

సీఐఐ సదస్సులో చెత్త అనేది లేకుండా చేయడం ద్వారా దేశంలోనే మొదటి జీరో వేస్ట్‌ ఈవెంట్‌గా గుర్తింపుపొందాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. సదస్సు జరిగే రెండురోజులు ప్రాంగణంలో సింగిల్‌ యూజ్‌ప్లాస్టిక్‌ అనేది లేకుండా ఎకో ఫ్రెండ్లీ వస్తువులనే వాడాలని నిర్ణయించారు. అతిథులు టీ, కాఫీ తాగేందుకు కప్పులను ప్రత్యేకంగా రాగిపిండితో తయారుచేశారు. టీ తాగేసిన తర్వాత కప్పులను తినేయాలని సూచిస్తారు. అలాగే ప్రతినిధులకు ప్లాస్టిక్‌ బాటిళ్లతో కాకుండా మట్టితో తయారుచేసిన వాటితో తాగునీరు అందించబోతున్నారు. భోజనం ప్లేట్లు, టిష్యూ పేపర్లు వంటివి ఉన్నాసరే వాటిని అక్కడికక్కడే రీసైక్లింగ్‌ చేసేలా ఏర్పాటుచేస్తున్నారు. పొడిచెత్తను వేరుచేసి అక్కడికే వ్యాపారులు వచ్చి కొనుక్కొని వెళ్లేలా వెసులుబాటు కల్పించనున్నారు. తడిచెత్తను కూడా ప్రాంగణంలోనే రీసైక్లింగ్‌ చేసేలా ప్రత్యేకంగా కంపోస్ట్‌ యూనిట్‌ను ఏర్పాటుచేశారు. సదస్సు జరిగే రెండు రోజులు ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణకు జీవీఎంసీ అధికారులు మూడు షిప్టుల్లో కార్మికులను సిద్ధం చేశారు.


ఉప రాష్ట్రపతి రాక రేపు

భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవానికి హాజరు

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

భారత ఉపరాష్ట్రపతి సీఎం రాధాకృష్ణన్‌ ఈనెల 14వ తేదీన నగరానికి రానున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి వెళతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం 8.55 గంటలకు 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరై ప్రసంగిస్తారు. 11.15 గంటలకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం నుంచి బయలుదేరి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీ వెళతారు. ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, సీపీ డాక్టర్‌ శంఖబ్రతబాగ్చి, ఉప రాష్ట్రపతి భద్రతా అధికారి సింగ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఇతర అఽధికారులు సమీక్షించారు. ఇదిలావుండగా పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రాతో కలిసి ఏయూ మైదానంలో సదస్సు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు మరో ఇద్దరు ఐఎఎస్‌లు

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):

భాగస్వామ్య సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను నియమించింది. అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షుశుక్ల్లాలు ఈనెల 14, 15 తేదీల్లో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌తో కలిసి ఈ విధులు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Nov 13 , 2025 | 01:37 AM