Share News

పెట్టుబడిదారుల సదస్సుకు నగరం ముస్తాబు

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:16 AM

నగరం వేధికగా వచ్చేనెల 14,15 తేదీల్లో జరగనున్న పారిశ్రామిక పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు (సీఐఐ)కు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సదస్సు జరిగే పరిసరాలతోపాటు హాజరయ్యే ప్రతినిధులు ప్రయాణించే మార్గాల్లో సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి.

పెట్టుబడిదారుల సదస్సుకు   నగరం ముస్తాబు

జోరుగా సుందరీకరణ పనులు

విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):

నగరం వేధికగా వచ్చేనెల 14,15 తేదీల్లో జరగనున్న పారిశ్రామిక పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు (సీఐఐ)కు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సదస్సు జరిగే పరిసరాలతోపాటు హాజరయ్యే ప్రతినిధులు ప్రయాణించే మార్గాల్లో సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి.

బీచ్‌రోడ్డు పార్కుహోటల్‌ జంక్షన్‌ నుంచి పిషింగ్‌హార్బర్‌ వరకు సెంటర్‌ మీడియన్లకు, ఐరన్‌గ్రిల్స్‌కు ఆకట్టుకునేలా రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఫుట్‌పాత్‌లు, డివైడర్లను ముస్తాబు చేస్తున్నారు. సెంటర్‌ మీడియన్లు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న గ్రీన్‌ డెక్ట్‌ల్లో మనసును పులకరింజేసేలా పూల మొక్కలను నాటుతున్నారు. బీచ్‌రోడ్డులో ప్రయాణించే వారికి పచ్చదనం కనువిందు చేసేలా జీవీఎంసీ హార్టీకల్చర్‌ ఆధ్వర్యంలో గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. పార్కుహోటల్‌ జంక్షన్‌లోని రెండు సర్కిళ్లలో రంగులు వెలిసిపోయిన కళాఖండాలకు కొత్తగా రంగులు వేయడంతో ఆకట్టుకుంటున్నాయి. సిరిపురం కూడలి నుంచి దత్‌ఐలాండ్‌, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ ఆలయం వరకు రోడ్డు మధ్యలోని డివైడర్‌కు రంగులు, ఇరువైపులా ఉన్న గోడలపై పెట్టుబడిదారుల సదస్సుకు సంబంధించిన లోగోలు, నినాదాలతో అద్భుతమైన కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఆమార్గం నూతనశోభను సంతరించుకుంది. సిరిపురం జంక్షన్‌ నుంచి ఆశీల్‌మెట్ట తెలుగుతల్లి ఫైఓవర్‌ మార్గంలో వేమనమందిరం వద్ద కొత్తగా సర్కిల్‌ను నిర్మించి, సంపత్‌వినాయగర్‌ ఆలయం లాండ్‌మార్క్‌ స్ఫురించేలా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతో సరికొత్త అందం ఆవిష్కృతమయింది. నగరంలో ఎటు చూసినీ సీఐఐ సదస్సుకు సంబంధించిన అభివృద్ధి, సుందరీకరణ పనులే జోరుగా సాగుతున్నాయి.

Updated Date - Oct 27 , 2025 | 01:16 AM