పెట్టుబడుల సదస్సుకు నగరం ముస్తాబు
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:22 AM
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుకు నగరం ముస్తాబవుతోంది.
రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు
రహదారులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మరమ్మతులు, సుందరీకరణ
రూ.3 కోట్లతో పచ్చదనం అభివృద్ధి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుకు నగరం ముస్తాబవుతోంది. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులకు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం సుమారు రూ.40 కోట్ల వ్యయంతో రోడ్లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి.
రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను రాబట్టేందుకు ప్రభుత్వం వచ్చే నెల 14, 15 తేదీల్లో నగరం వేదికగా సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు 30 దేశాల నుంచి 40 మంది ప్రతినిధులు, దేశవ్యాప్తంగా ఉన్న వంద మందికిపైగా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చే ప్రతినిధులు ప్రయాణించే మార్గాలు, వారు బసచేసే, సందర్శించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పెద్దఎత్తున సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్, ఆలిండియా రేడియో స్టేషన్ డౌన్ మీదుగా బీచ్‌రోడ్డు వరకూ మార్గంలో ఫుట్‌పాత్‌లు, గ్రీన్‌బెల్ట్ మరమ్మతులు, సుందరీకరణ, గ్రీనరీ డెవలప్‌మెంట్, లైటింగ్ ఏర్పాటుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి సింహాచలం, అడవివరం, హనుమంతవాక మీదుగా విశాలాక్షి నగర్ వైపు రోడ్ల మరమ్మతులు, మార్జిన్ పెయింటింగ్‌లు జరుగుతున్నాయి. హనుమంతవాక జంక్షన్ నుంచి వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, ఎంవీపీలోని కరాచీ బేకరీ మీదుగా సమతా కాలేజీ వరకూ, కరాచీ బేకరీ జంక్షన్ నుంచి ఎంవీపీ డబుల్‌రోడ్డు, రైతుబజార్ సర్కిల్ మీదుగా అప్పుఘర్ వరకు కొత్తరోడ్లు, పెయింటింగ్‌లు, ఫుట్‌పాత్‌ల రిపేర్లు, రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి సీతకొండ వరకు బీచ్‌రోడ్డు సుందరీకరణ, మార్జిన్‌ల పెయింటింగ్, ఫుట్‌పాత్‌లు, గ్రిల్స్ పెయింటింగ్ పనులు చేపట్టారు. వీఐపీ రోడ్డు, సిరిపురం జంక్షన్, బీచ్‌రోడ్డు, పెదవాల్తేరు కరకచెట్టుపోలమాంబ ఆలయం మీదుగా కురుపాం సర్కిల్ వరకు రోడ్డు మరమ్మతు చేస్తున్నారు. కొన్నిరోడ్లు బాగానే ఉన్నప్పటికీ అధికారుల కమిటీ సూచనల మేరకు కొత్తలేయరు వేసేందుకు ఆమోదించారు. మరోవైపు నగరంలో పచ్చదనం పెంపు కోసం హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మద్దిలపాలెం, సిరిపురం, పెదవాల్తేరు, బీచ్‌రోడ్డులో సీఐఐ సదస్సు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.