పెట్టుబడుల సదస్సుకు నగర సుందరీకరణ
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:01 AM
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది.
రూ.28 కోట్లతో పనులు..స్టాండింగ్ కమిటీ ఆమోదం
అజెండాను ముందురోజు అందజేయడంపై సభ్యుల ఆగ్రహం
బాగున్న రోడ్లపై మళ్లీ బీటీ లేయర్ వే యాలన్న ప్రతిపాదనలపైనా అసంతృప్తి
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన పాత కౌన్సిల్‌హాల్‌లో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం మూడు రోజులు ముందు అజెండా కాపీ అందజేయాల్సి ఉన్నా...సమావేశం జరగడానికి ముందురోజు పంపడంలో ఆంతర్యమేమిటని అధికారులను ప్రశ్నించారు. దీనికి మేయర్ సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుకు నగరం ఆతిథ్యం ఇస్తుండడంతో జిల్లా కలెక్టర్ సూచనమేరకు అత్యవసరంగా స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేయాల్సి వచ్చిందని వివరించారు. పెట్టుబడుల సదస్సు సందర్భంగా నగర సుందరీకరణ పనులకు ఆమోదం కోసమే ఈ సమావేశం ఏర్పాటుచేశామని సభ్యులకు సర్దిచెప్పారు. అనంతరం కొందరు సభ్యులు మాట్లాడుతూ నగరంలో ఇటీవల నిర్మించిన రోడ్లు, బాగానే ఉన్న రోడ్లను కూడా కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారని, దీనివల్ల జీవీఎంసీ నిధులు దుర్వినియోగం అవుతాయే తప్ప, నగరవాసులకు ప్రయోజనం ఉండదన్నారు. ఆ నిధులను పాడైపోయిన రోడ్లను బాగుచేయడానికి కేటాయించాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉంటే వాటిని అజెండాలో చేర్చేవారు కాదన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అజెండాలో పొందుపరిచే అంశాలపై సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతిపాదిత పనుల వద్దకు మంగళవారం తీసుకువెళ్లి వారి అనుమానాలను నివృత్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరావు వివరణ ఇస్తూ, సీఐఐ సదస్సుకు ఖర్చు చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేస్తుందని, ఏఏ పనులు చేయాలో ప్రత్యేక నిపుణుల అధికారుల బృందం పరిశీలించి జీవీఎంసీకి ఒక నివేదిక ఇస్తుందన్నారు. దాని ప్రకారమే పనులను చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి, ఆ నివేదికలో పేర్కొన్న పనులను ప్రతిపాదించామన్నారు. అజెండాలోని 92 అంశాలను చర్చించిన సభ్యులు వాటిని ఆమోదించారు. ఆమోదించిన అంశాల్లో సుమారు రూ.28 కోట్ల పనులు సీఐఐ సదస్సుకు సంబంధించినవి కాగా రూ.5.3 కోట్ల పనులు నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సమావేశంలో కార్యదర్శి బీవీ రమణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అన్నివిభాగాల అధికారులు పాల్గొన్నారు.