Share News

సర్కస్‌ ప్రయాణం

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:20 PM

మండలంలోని సొలభం పంచాయతీ మారుమూల మల్లిపాడు గ్రామం చేరుకోవాలంటే పెద్ద సాహసమే చేయాలి.

సర్కస్‌ ప్రయాణం
కర్రల వంతెనపై నడుస్తున్న మల్లిపాడు గ్రామస్థులు

కర్రల వంతెనపై రాకపోకలు

మల్లిపాడు గిరిజనుల కష్టాలు

వంతెన నిర్మించాలని వినతి

జి.మాడుగుల, ఆగస్టు 29 (ఆంధ్రజోతి): మండలంలోని సొలభం పంచాయతీ మారుమూల మల్లిపాడు గ్రామం చేరుకోవాలంటే పెద్ద సాహసమే చేయాలి. గ్రామంలో 20 గిరిజన కుటుంబాలు పూర్వం నుంచి నివాసం ఉంటున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే.. వారి కష్టాలు వర్ణణాతీతం. గ్రామానికి వెళ్లే దారిలో పెద్ద వాగు ఉంది. దానిపై వంతెన లేదు. ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మించాలని మల్లిపాడు గ్రామస్థులు అధికారులు, పాలకులను వేడుకుంటున్నారు. అయినా వంతెన మంజూరు కాలేదు. దీంతో ఆ గ్రామస్థులు బయట గ్రామాలకు వెళ్లాలంటే వాగు దాటేందుకు చెట్ల మధ్య కర్రలు కట్టి వంతెనలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కర్రల వంతెనపై వెళ్లేటప్పుడు పడిపోకుండా ఒక తాడును వాగుకు రెండు వైపులా కట్టుకున్నారు. తాడు పట్టుకొని కర్రల వంతెనపై దేవుడిపై భారం వేసి నడుస్తూ రాకపోకలు సాగిస్తారు. కర్రెల వంతెన కింద ఉధృతంగా ప్రవహించే పెద్ద వాగు ఉంది. ప్రమాదవశాత్తు ఏ మాత్రం కాలు జారినా వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని మల్లిపాడు గిరిజనులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 29 , 2025 | 11:20 PM