Share News

సింహగిరి ప్రదక్షిణ రేపే

ABN , Publish Date - Jul 08 , 2025 | 01:07 AM

సింహ‘గిరి ప్రదక్షిణ’ను బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.

సింహగిరి ప్రదక్షిణ రేపే

రెండు రోజులపాటు దేవస్థానంలో ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం, జూలై 7 (ఆంరఽధజ్యోతి):

సింహ‘గిరి ప్రదక్షిణ’ను బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం...కొండదిగువన తొలిపావంచా వద్ద ప్రారంభమయ్యే పుష్ప రథం అడివివరం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షి నగర్‌, జోడుగుళ్లపాలెం, ఎం.వి.పి.డబుల్‌ రోడ్డు, వెంకోజీపాలెం, సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లే అవుట్‌, మాధవధార, మురళీనగర్‌, కుమారి కల్యాణమండపం, పాతగోశాల మీదుగా తిరిగి తొలిపావంచాకు చేరుకుంటుంది. పౌర్ణమి అనగా ఈనెల పదో తేదీ...గురువారం ఉదయం 5.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని 9, 10 తేదీల్లో అప్పన్న ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తుల రద్దీ నియంత్రణలో భాగంగా రెండు రోజులు మెట్లమార్గంలో భక్తులను కొండ దిగువకు రాకుండా నిలుపుదల చేసి, దేవస్థానం ఉచిత బస్సుల ద్వారా చేరవేస్తారు. అలాగే కొండపైన క్యూలు, కేశఖండనశాల, బస్టాండ్‌, గంగధార, ఇతర రద్దీ ప్రదేశాల్లో అవాంఛనీయ ఘటనలు, తోపులాటలు, చోటుచేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు వైద్య సహాయం కోసం మార్గం పొడవునా 30 తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో మద్యం దుకాణాలు మూసివేయించేందుకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్ౖసజ్‌ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో తొమ్మిదో తేదీ ఉదయం నుంచి పదో తేదీ సాయంత్రం వరకూ ప్రత్యేక బస్సులు నడపనున్నది.


ప్రైవేటు పాఠశాలలపై సీరియస్‌

పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వడానికి నిరాకరించిన 18 విద్యా సంస్థలకు విద్యా శాఖ నోటీసులు

చర్యలు తప్పవన్న డీఈవో

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

విద్యా హక్కు చట్టం కింద పేద వర్గాలకు ఉచితంగా ప్రవేశాలు కల్పించడానికి నిరాకరిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై విద్యా శాఖ సీరియస్‌ అయ్యింది. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించిన 18 పాఠశాలలకు నోటీసులు జారీచేసింది. నగరంలో ప్రముఖ పాఠశాలలుగా గుర్తింపు పొందిన లిటిల్‌ ఏంజిల్స్‌, టింపనీ, శ్రీప్రకాష్‌, భాష్యం, సత్యసాయి, యాపిల్‌, పొలాక్స్‌...ఇలా మొత్తం 18 పాఠశాలలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులతో సరిపెట్టకుండా సంబంధిత మండల విద్యాశాఖాధికారుల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలను రప్పిస్తోంది. రెండు విడతలలో 4,300 మందికి ఉచిత సీట్లు కేటాయించగా, 2,990 మందికి ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు లభించాయి. మిగిలిన వారిని యాజమాన్యాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సీట్లు ఇవ్వని యాజమాన్యాలతో ఎంఈవోలు మాట్లాడారు. అయినా పలు కారణాలు చూపుతూ సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. పొలాక్స్‌ యాజమాన్యంలోని మూడు పాఠశాలలల్లో 60 సీట్లు కేటాయించగా, 40 మందిక్లి ఇచ్చి మిగిలిన వారిని తిరస్కరించడంపై విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. సీట్లు ఇవ్వకుంటే చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 18 పాఠశాలలకు నోటీసులు ఇచ్చామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం సీట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. ఏదైనా కారణంతో ఒక విద్యార్థికి సీటు నిరాకరించినట్టయితే అన్ని అర్హతలున్న మరో విద్యార్థికి సీటు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకు కూడా ముందుకురాకపోతే తొలుత నోటీసులు ఇస్తామని, ఆ తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jul 08 , 2025 | 01:08 AM