ల్యాండ్ పూలింగ్ అక్రమాలపై సీఐడీ దూకుడు
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:47 AM
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) మాటున వైసీపీ నాయకులు పాల్పడిన అక్రమాలపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. అనకాపల్లి, సబ్బవరం మండలాల్లో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన స్థలాలు, భూముల కొనుగోలు/ అమ్మకాలకు అవకాశం లేకుండా సీఐడీ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
భూ సమీకరణ ఫిర్యాదులపై విచారణ వేగవంతం
ఇప్పటికే కీలక రికార్డులు స్వాధీనం
అనకాపల్లి, సబ్బవరం మండలాల్లో నాడు పనిచేసిన అధికారులు, సిబ్బందికి తాజాగా నోటీసులు జారీ
పలు కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఆపాలని హౌసింగ్‌కు లేఖ
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) మాటున వైసీపీ నాయకులు పాల్పడిన అక్రమాలపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. అనకాపల్లి, సబ్బవరం మండలాల్లో ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన స్థలాలు, భూముల కొనుగోలు/ అమ్మకాలకు అవకాశం లేకుండా సీఐడీ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అనకాపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సేకరించి సుమారు 900 ఎకరాలకు సంబంధించి సర్వే నంబర్ల వివరాలను రిజిస్ట్రార్‌కు అందించినట్టు తెలిసింది.
గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములను సమీకరించాలని 2021-22లో అధికారులకు ఆదేశాలు జారీచేసింది. భూములు ఇచ్చిన రైతులకు ప్రతిఫలంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లలో స్థలాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. జిరాయితీ భూమి అయితే ఎకరాకు 1,800 గజాలు, డి.పట్టా భూమి అయితే 900 గజాలు, పదేళ్లకు మించి పేద రైతులు సాగు చేసుకుంటూ పట్టా లేని భూమి అయితే 450 గజాలచొప్పు కేటాయించాలని పేర్కొన్నది. ఈ విషయం ముందుగానే వైసీపీ నాయకులకు చేరింది. భూ సమీకరణ చేసే గ్రామాలు, ఆయా సర్వే నంబర్లు వివరాలను అధికారుల నుంచి సేకరించారు. డి.పట్టాదారులు, ఎటువంటిపట్టా లేకుండా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న వారి జాబితాలను రప్పించుకున్నారు. పలువురు రైతులను భయపెట్టి, బెదిరించి తక్కువ ధరకు బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో పేర్లు మార్చేశారు. తరువాత అధికారులు మొత్తం 111 గ్రామాల్లో సుమారు 900 ఎకరాలు సమీకరించి లేఅవుట్లు వేశారు. వైసీపీ నాయకులు రిటర్న్ ప్లాట్లుగా లేఅవుట్లలో మంచి వాస్తు, రహదారికి పక్కనన్న స్థలాలను తీసేసుకున్నారు. ఈ తరహా అక్రమాలు కుంచంగి, కూండ్రం, సంపతిపురం, కోడూరు, కొండుపాలెం, వేటజంగాలపాలెం, మామిడిపాలెం గ్రామాల్లో అధికంగా జరిగాయి. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేసి, ల్యాండ్ పూలింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. కానీ నాటి ప్రభుత్వం ఫిర్యాదును బుట్టదాఖలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత వైసీపీ నేతల భూ అక్రమాలపై సీఐడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ఏడాది డిసెంబరులో అనకాపల్లి, సబ్బవరం తహసీల్దారు కార్యాలయాల్లో సీఐడీ అధికారి నాగేంద్ర భూపాల్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిపలు రికార్డులను వెంట తీసుకెళ్లారు. ల్యాండ్‌పూలింగ్ జరిగిన కాలంలో ఈ పనిచేసిన రెవెన్యూ అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులకు తాజాగా సీఐడీ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం వీరు ఏ మండలంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ అనకాపల్లి, సబ్బవరం మండలాల్లో ల్యాండ్ పూలింగ్‌లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవాల్సి ఉంటుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు రైతుల నుంచి సమీకరించిన భూముల వివరాలు, సర్వే నంబర్లు, పరిహారంగా కేటాయించిన ప్లాట్లకు సంబంధించిన వివరాలను సీఐడీ సేకరిస్తున్నట్టు సమాచారం. కుంచంగి, కూండ్రంగి, సంపతిపురం, కోడూరు, వేటజంగాలపాలెం కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను సీఐడీ ఆదేశించింది.