Share News

చింతపల్లి సొసైటీ కార్యదర్శి చేతివాటం

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:23 PM

స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్‌)లో రైతుల రుణాల నిధులు రూ.20 లక్షలను సొసైటీ కార్యదర్శి స్వాహా చేశాడు. కొంత మంది రైతుల పేరిట రుణాలు మంజూరు చేసి కాజేశాడు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ రశీదులిచ్చి దగా చేశాడు.

చింతపల్లి సొసైటీ కార్యదర్శి చేతివాటం
చింతపల్లి పీఏసీఎస్‌ కార్యాలయం

పీఏసీఎస్‌లో రుణాల నిధులు రూ.20లక్షలు స్వాహా

నకిలీ రశీదులతో రుణాల నగదు వసూలు

రైతులకు తెలియకుండా రుణాలు మంజూరు

బ్యాంకులో జమ చేయకుండా మింగేశాడని రైతుల ఆరోపణ

ఆరు నెలల క్రితం బయటపడ్డ నిధుల స్వాహా బాగోతం

విచారణ పేరిట డీసీసీబీ అధికారులు కాలయాపన

నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరణతో వెలుగులోకి..

చింతపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్‌)లో రైతుల రుణాల నిధులు రూ.20 లక్షలను సొసైటీ కార్యదర్శి స్వాహా చేశాడు. కొంత మంది రైతుల పేరిట రుణాలు మంజూరు చేసి కాజేశాడు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ రశీదులిచ్చి దగా చేశాడు. ఈ అక్రమాలు ఆరు నెలల క్రితం బయటపడినప్పటికీ డీసీసీబీ అధికారులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారు. నూతనంగా వారం రోజుల క్రితం పీఏసీఎస్‌ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

చింతపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్‌) పరిధిలో 1,320 మంది గిరిజన రైతులు సభ్యులుగా ఉన్నారు. పీఏసీఎస్‌ పరిధిలో రూ.1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. 2019 నుంచి 2021 వరకు పీఏసీఎస్‌ పరిధిలో 623 మంది గిరిజన రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేశారు. ఒక్కొక్క రైతుకి రూ.పది వేలు నుంచి రూ.95 వేల వరకు రుణాలు అందజేశారు. వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ఏడాదికి ఒకసారి వాయిదా చెల్లించాలి. నూటికి ఏడు శాతం వడ్డీ పడుతుంది. తీసుకున్న నగదు ఏడాదిలోపు చెల్లించిన రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తుంది. స్థానిక పీఏసీఎస్‌ పరిధిలో రుణాలు తీసుకున్న రైతుల్లో అత్యధికులు నిరక్ష్యరాస్యులే ఉన్నారు. పీఏసీఎస్‌ రికార్డులన్నీ ఆఫ్‌లైన్‌లోనే ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన కార్యదర్శి అక్రమాలకు తెరతీశాడు.

గిరిజనులను దగా చేసిన కార్యదర్శి

పీఏసీఎస్‌లో 20ఏళ్లుగా బిర్ల ఈశ్వరరావు కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. రుణాలు పొందిన గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కార్యదర్శి భారీ మోసానికి పాల్పడ్డాడు. 2019 నుంచి 2021 వరకు రైతులకు పంపిణీ చేసిన రుణాలను వసూలు చేసి బ్యాంక్‌ ఖాతాలో జమచేయకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాడు. అంతర్ల గ్రామానికి చెందిన వేములపూడి లక్ష్మి 2015లో పీఏసీఎస్‌లో రూ.15,386 రుణం తీసుకుంది. ఆమెకు 2022 నాటికి అసలు, వడ్డీ కలుపుకుని రూ.30వేలు పీఏసీఎస్‌కి చెల్లించాల్సి వుంది. రైతు లక్ష్మి ఈ నగదుని కార్యదర్శి ఈశ్వరరావుకి చెల్లించినప్పటికీ పీఏసీఎస్‌ ఖాతాలో జమ చేయలేదు. నేటికీ ఆమె పేరిట రూ.30 వేలు బకాయి ఉంది. గొందిపాకలు గ్రామానికి చెందిన బౌడు కుశలవుడు పీఏసీఎస్‌లో రూ.45వేల రుణం తీసుకున్నాడు. రైతు 2018లో రెండు దఫాలుగా రూ.1,120, రూ.21,500, మూడోదఫాగా 2024లో రూ.మూడు వేలు కార్యదర్శి ఈశ్వరరావుకి చెల్లించాడు. అయితే కార్యదర్శి ఈశ్వరరావు రైతుకి నకిలీ రశీదు ఇచ్చి, వసూలు చేసిన నగదుని బ్యాంక్‌ ఖాతాలో జమ చేయలేదు. ఈ విషయాన్ని సంబంధిత రైతు కార్యదర్శిని ప్రశ్నించగా.. 2025 మార్చి నాటికి నగదు బ్యాంక్‌ ఖాతాలో జమ చేసి, రుణం లేకుండా చేస్తానని హామీ పత్రం రాసి ఇచ్చాడు. జోహార్‌ గ్రామానికి చెందిన వంతల చందరరావు 2019 సెప్టెంబరులో రూ.65వేల రుణం తీసుకున్నాడు. 2020 ఆగస్టులో రైతు తీసుకున్న నగదు మొత్తం చెల్లించేశాడు. అయితే సంబంధిత రైతుకి తెలియకుండా కార్యదర్శి ఈశ్వరరావు 2020 డిసెంబరులో రూ.30 వేలు రుణం మంజూరుచేసి సొంతానికి వాడుకున్నాడు. ఇదేవిధంగా సమగిరి, గొందిపాకలు గ్రామాల నుంచి 36మంది రైతులకు చెందిన రూ.ఎనిమిది లక్షలను ఈశ్వరరావు దోచుకున్నాడు. ఈ విషయమై 36 మంది రైతులు డీసీసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇతర గ్రామాల్లో ఫిర్యాదు చేయని మరో 180మంది రైతులకు చెందిన రూ.12లక్షలు రుణాలు కార్యదర్శి ఈశ్వరరావు దోచుకున్నట్టు బాధితులు చెబుతున్నారు.

విచారణ పేరిట కాలయాపన

స్థానిక పీఏసీఎస్‌లో రైతుల రుణాల నిధులు రూ.20లక్షలు కార్యదర్శి దోచుకున్నట్టు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ డీసీసీబీ అధికారులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారే తప్ప కనీస చర్యలు తీసుకోవడంలేదు. 2025 జూలై 15న డీసీసీబీ డివిజనల్‌ మేనేజర్‌ ఎల్‌. అప్పలరాజు విచారణ చేపట్టగా.. రైతులు వాస్తవాలను వివరించారు. అయితే నేటి వరకు అక్రమాలకు పాల్పడిన కార్యదర్శిపై డీసీసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం కార్యదర్శి ఈశ్వరరావు ఆరు నెలలుగా విధులకు గైర్హాజరై మైదాన ప్రాంతంలో విలాసవంతమైన జీవితాన్ని సాగిస్తున్నాడు. కార్యదర్శిపై కనీస చర్యలు తీసుకోకపోవడం వెనుక డీసీసీబీ ఉన్నతాధికారుల హస్తం ఉందనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిపోయిన రుణాలు పంపిణీ

పీఏసీఎస్‌లో రైతుల రుణాల నగదు భారీ మొత్తంలో కార్యదర్శి ఈశ్వరరావు దోచుకోవడంతో 2021 నుంచి నేటి వరకు రైతులకు రుణాల పంపిణీ నిలిచిపోయింది. దీంతో గిరిజన రైతులు పీఏసీఎస్‌కి రుణాల కోసం వచ్చిన దాఖలాలు లేవు. అప్పటి వైసీపీ పాలకులు, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ నిర్లక్ష్యం వల్ల రైతులు వ్యవసాయ రుణాలకు దూరమయ్యారు.

పీఏసీఎస్‌లో అక్రమాలు వాస్తవమే

గెమ్మెలి అబ్బాయినాయుడు, చైర్‌పర్సన్‌, పీఏసీఎస్‌, చింతపల్లి

స్థానిక పీఏసీఎస్‌లో రైతుల రుణాల నిధులు కేటాయింపు, వసూళ్లలో అక్రమాలు జరగడం వాస్తవమే. కార్యదర్శి ఈశ్వరరావు గిరిజన రైతులకు నకిలీ రశీదులు ఇచ్చి, వసూలు చేసిన నగదు బ్యాంక్‌లో జమ చేయలేదు. కొంత మంది రైతుల పేరిట కొత్త రుణాలు మంజూరు చేసి అతనే తీసుకున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అక్రమాలపై లోతుగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీసీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాం.

Updated Date - Aug 29 , 2025 | 11:23 PM