చింతపల్లి ఆర్గానిక్ పాలిటెక్నిక్ ఎత్తివేత
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:30 PM
స్థానిక ఆచార్య ఎన్‌జీ రంగా ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో చింతపల్లి ఆర్గానిక్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలను కూడా నిలిపివేశారు.
ఉత్తర్వులు జారీచేసిన ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్
2025-26 ప్రవేశాలు నిలిపివేత
నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్
ఆందోళన చెందుతున్న విద్యార్థులు
కళాశాల పునరుద్ధరించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
చింతపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆచార్య ఎన్‌జీ రంగా ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో చింతపల్లి ఆర్గానిక్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలను కూడా నిలిపివేశారు. శనివారంతో వెబ్ ఆప్షన్స్ ముగుస్తుండడం, ఆప్షన్స్‌లో చింతపల్లి పాలిటెక్నిక్ కళాశాలను తొలగించడంతో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విశ్వవిద్యాలయం అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని గిరిజన ప్రాంత విద్యార్థులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అర్హతతో వ్యవసాయ విద్య ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం రెండేళ్ల కాల పరిమితి గల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సును 1999 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారిగా అనకాపల్లి, మార్టెరు (పశ్చిమగోదావరి)లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు. 2005లో పొదనలకూరు(నెల్లూరు), రెడ్డిపల్లి (అనంతపురం), ఉటుకూరు(కడప)లో మూడు కళాశాలలు ఏర్పాటు చేశారు. ఈ కోర్సుకు విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో 2007, 2011 నుంచి కళాశాలల సంఖ్యను పెంచారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 2011లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. 2016లో ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలగా మార్పు చేశారు. రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ ఆర్గానిక్ పాలిటెక్నిక్ కళాశాల చింతపల్లిలో మాత్రమే ఉన్నది.
14ఏళ్లుగా విద్యార్థులకు వ్యవసాయ విద్య
చింతపల్లి ఆర్గానిక్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 14 ఏళ్ల పాటు విద్యార్థినీ, విద్యార్థులకు వ్యవసాయ విద్యను అందించారు. కళాశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు అగ్రీసెట్ ద్వారా ఏజీబీఎస్సీ అభ్యసించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మెజారిటీ విద్యార్థులు పాలిటెక్నిక్ అర్హతతోనే ఉద్యోగాలు చేస్తున్నారు. చింతపల్లిలో విద్యాభ్యాసం చేసేందుకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు రాయలసీమ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు.
వ్యవసాయ విద్యకు అనువైన ప్రాంతం
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ విద్యకు అనువైన ప్రాంతంగా విద్యార్థులు చెబుతున్నారు. సాధారణంగా కళాశాలలు ఉన్నప్పటికి వివిధ పంటలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు అనువైన భూములు, పంటలు అందుబాటులో ఉండవు. చింతపల్లి ఆర్గానిక్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పరిశోధన స్థానంలో జరుగుతున్న వివిధ పరిశోధనల్లో భాగస్తులవుతున్నారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను పంట పొలంలో ప్రాక్టికల్స్ చేసేందుకు అనువుగా వుంటుంది. ఈ ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం తాజాగా ఆర్గానిక్ జోన్‌గా ప్రకటించింది. దీంతో పరిశోధన స్థానంలో పంటలన్నీ ఆర్గానిక్ పద్ధతిలోనే అధ్యయనం చేస్తున్నారు. విద్యార్థులు స్వయంగా అరుదైన పంటలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో చింతపల్లి కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కళాశాలలో 25 సీట్లు ఉండగా.. ప్రతి ఏడాది 20మందికి మించి విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. గత ఏడాది అనివార్య కారణాలతో పది మంది బాలికలు, ఒక బాలుడు ప్రవేశాలు పొందారు.
సీట్లు భర్తీకావడం లేదనే సాకుతో..
చింతపల్లి ఆర్గానిక్ పాలిటెక్నిక్ కళాశాలలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ సీట్లు భర్తీ కావడంలేదని, నిధులు కొరత ఉందని కళాశాలను ఎత్తివేస్తున్నట్టు ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి. రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. చింతపల్లితో పాటు తిరుపతి పాలిటెక్నిక్ కళాశాలను సైతం మూసివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే రెండు కళాశాలల్లో ప్రవేశాలు నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయం అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంత జిల్లాల విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శనివారంతో వెబ్ ఆప్షన్ సమయం ముగుస్తుండడంతో వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు జోక్యం చేసుకుని చింతపల్లి పాలిటెక్నిక్ కళాశాలను పునరుద్ధరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.