స్వల్ప అనారోగ్యంతో చిన్నారి మృతి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:33 PM
మండలంలోని మూలపేట పంచాయతీ కొండ శిఖర గ్రామమైన జాజులబంద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
ఓ వైపు వర్షం, మరోవైపు రహదారి సౌకర్యం లేక ఆస్పత్రికి తీసుకు వెళ్లలేని పరిస్థితి
జాజులబంద గ్రామంలో విషాదం
కొయ్యూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని మూలపేట పంచాయతీ కొండ శిఖర గ్రామమైన జాజులబంద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కామేశ్వరరావు నాలుగు నెలల వయస్సు గల కుమారుడు ఎనోస్‌కుమార్ స్వల్ప అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం, మరో వైపు భారీ వర్షాల కారణంగా కొండ దిగడం కష్టమై ఆస్పత్రికి తీసుకువెళ్లలేని దయనీయ స్థితిలో ఆ చిన్నారి మృతి చెందాడు. దీనికి సంబంధించి బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. జాజులబంద గ్రామానికి చెందిన మర్రి కామేశ్వరరావు భార్య కుమారి మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. కాగా వారి నాలుగు నెలల కుమారుడు ఎనోస్‌కుమార్ సోమవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. రహదారి సౌకర్యం లేకపోవడం, భారీ వర్షాలు కురుస్తుండడంతో కనీసం కాలినడకన ఆస్పత్రికి తీసుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంగళవారం రాత్రి నిద్రలోనే ఆ చిన్నారి మృతి చెందాడు. రహదారి సౌకర్యం లేకపోవడం వల్లే చిన్నారి మృతి చెందాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన మర్రి రామారావు కూడా తీవ్ర అనారోగ్యంతో విషమ పరిస్థితిలో ఉన్నాడు.