Share News

స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు ముఖ్యమంత్రి కృషి

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:04 AM

స్టీల్‌ ప్లాంటు పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు ముఖ్యమంత్రి కృషి

ప్రక్షాళనలో భాగంగానే యాజమాన్యం సింగిల్‌ విండో కాంట్రాక్టర్‌ విధానాన్ని తీసుకొస్తోంది

42 విభాగాలకు 42 మంది కాంట్రాక్టర్‌లు మాత్రమే ఉండేలా చర్యలు

నిర్వాసితులకు అన్యాయం జరగదు

కాంట్రాక్టు కార్మికుల పోస్టుల్లో 50 శాతం నిర్వాసితులకు కేటాయించాల్సిందే

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

గాజువాక, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటు పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాంటు ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం సింగిల్‌ విండో కాంట్రాక్టర్‌ విధానాన్ని తీసుకువస్తున్నదన్నారు. గతంలో వెయ్యి మంది కాంట్రాక్టర్‌లు ఉండేవారని, ప్లాంటుపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రస్తుతం 42 విభాగాలకు 42 మంది కాంట్రాక్టర్‌లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీనిని కొంతమంది ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో కొంతమంది కాంట్రాక్టర్‌లు, అధికారులు, కార్మిక నాయకులు కుమ్మక్కై లేని రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారన్నారు. బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టిన తరువాత అవకతవకలు బయపడ్డాయన్నారు. వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు.

స్టీల్‌ప్లాంటు నిర్వాసితులకు అన్యాయం జరగదని, అందరికీ ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల పోస్టుల్లో యాభై శాతం నిర్వాసితులకు కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్లాంటులో ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలన్నారు. నిర్వాసిత కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మిగిలిన నిర్వాసితులకు కూడా ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. నిర్వాసిత కార్మికులు, సీనియర్‌ కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టర్లు కొనసాగించాలన్నారు. నిర్వాసితులకు అన్యాయం జరగదని, వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, కార్పొరేటర్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:04 AM