Share News

కూటమిలో కోడి వ్యర్థాల దుమారం

ABN , Publish Date - May 27 , 2025 | 01:37 AM

నగరంలో కోడి వ్యర్థాల సేకరణకు కూటమి నేతలు కొందరు తమ అనుచరులను ప్రోత్సహించడం హాట్‌టాపిక్‌గా మారింది.

కూటమిలో కోడి వ్యర్థాల దుమారం

  • దుకాణాల నుంచి సేకరణకు ఆరు నెలల కిందట జోన్ల వారీగా టెండర్లు

  • పేరుకే టెండర్లు...ఒక్కో జోన్‌ ఒక్కో నేత అనుచరుడికి కేటాయింపు

  • మిగిలిన నేతల అనుచరుల నిరాశ

  • అనధికారికంగా కోడి వ్యర్థాల సేకరణ

  • దీంతో నేతల మధ్య పరోక్షంగా పోరు

  • తన అనుచరుడి కోసం ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి గొడవపడిన ఒక నేత

  • టెండర్లు రద్దు చేయాలంటే జిల్లా కలెక్టర్‌ను కోరిన ప్రజా ప్రతినిధి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో కోడి వ్యర్థాల సేకరణకు కూటమి నేతలు కొందరు తమ అనుచరులను ప్రోత్సహించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఒక జోన్‌ పరిధిలోని చికెన్‌ వ్యర్థాల సేకరణ టెండర్‌ ఒక నేత అనుచరుడికి దక్కితే మరో నేత తమ అనుచరుల ద్వారా అనధికారికంగా చికెన్‌ వ్యర్థాల సేకరణ జరిపిస్తుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో ఒక ప్రజా ప్రతినిధి ఏకంగా జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి చికెన్‌ వ్యర్థాల కాంట్రాక్టును రద్దు చేయాలని కోరినట్టు చెబుతున్నారు.

జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో సుమారు 2,500 చికెన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ దాదాపు మూడు టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని నగరంలోనే ఎక్కడైనా పడేస్తే పారిశుధ్యలోపం తలెత్తడంతోపాటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జీవీఎంసీయే స్వయంగా దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించి కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించేది. తర్వాత కాంట్రాక్టర్లకు అప్పగించింది. చికెన్‌ వ్యర్థాలను కొందరు చేపల చెరువుల యజమానులు మేతగా వేస్తుండడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. దీంతో చికెన్‌ వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన కాంట్రాక్టర్లు వ్యర్థాలను చేపల చెరువుల యజమానులకు విక్రయించడం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు తమకు లంచాలు ముట్టజెప్పిన వారికే చికెన్‌ వ్యర్థాల సేకరణ టెండర్లు దక్కేలా చక్రంతిప్పారు. దీనిపై గత ఏడాది తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో అప్పటి కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా జోన్‌లవారీగా టెండర్లు పిలిచారు. సేకరించిన వ్యర్థాలను నేరుగా కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించాల్సిందేనని నిబంధన పెట్టారు. అయితే కూటమి ప్రజా ప్రతినిధులు తమ అనుచరులకు ఏదో ఒక జోన్‌ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో టెండర్‌ నియమ నిబంధనలను పక్కనపెట్టేసి ఒక్కో ప్రజా ప్రతినిధికి ఒక్కొక్క జోన్‌ కేటాయించినట్టు సమాచారం. అయితే ఆ నియోజకవర్గంలో మిగిలిన కూటమి నేతలు తమ అనుచరులకు అవకాశం దక్కకపోవడంతో కోపంతో రగిలిపోతున్నారు. చికెన్‌ దుకాణాల నుంచి వ్యర్థాలు అనధికారికంగా సేకరించుకోవాల్సిందిగా తమ అనుచరులను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అనధికారికంగా వ్యర్థాలను సేకరిస్తున్నారంటూ టెండరు దక్కించుకున్నవారు తమ అస్మదీయులైన నేతల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి స్పందించిన నేతలు అలా వ్యర్థాలను సేకరించే వాహనాలను పట్టుకుని కేసులు నమోదుచేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. నేతల ఆదేశాల మేరకు అధికారులు వెళ్లి వాహనాలను పట్టుకుంటే మరో నేత వెంటనే రంగంలోకి దిగి పట్టుకున్న వాహనాలను వదిలిపెట్టాలని ఒత్తిడిచేస్తున్నారు. దీంతో అధికారులు నలిగిపోతున్నారు.

కూటమి నేతల మధ్య తారస్థాయికి చేరిన చిచ్చు:

దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక జోన్‌లో చికెన్‌ వ్యర్థాల సేకరణ టెండర్‌ కోసం ఇద్దరు నేతల అనుచరులు పోటీపడ్డారు. అనూహ్యంగా వారిద్దరికీ కాకుండా మరో నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధి సిఫారసు చేసిన వారికి టెండర్‌ను అధికారులు కేటాయించారు. దీంతో ఒక నేత నియోజకవర్గ పరిధిలోని కొన్ని దుకాణాల నుంచి వ్యర్థాలు సేకరించుకోవాలని తన అనుచరుడికి పురమాయించారు. అతను మూడు వాహనాలు పెట్టుకుని చికెన్‌ వ్యర్థాలను సేకరించి అనకాపల్లి జిల్లాలోని చేపల చెరువులకు తరలిస్తుండగా, టెండరు దక్కించుకున్న వ్యక్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విషయం సదరు నేతకు తెలియడంతో ఆగమేఘాల మీద వాహనాలు ఉంచిన పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసులపై కేకలు వేశారు. చికెన్‌ వ్యర్థాలను కాపులుప్పాడ తరలించకుండా చేపల చెరువులకు తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోరని ఎస్‌ఐపై అరవడంతో ఆ వాహనాలను విడిచిపెట్టేశారు. అదే నియోజకవర్గానికి చెందిన మరొక నేత కూడా తన అనుచరుడికి టెండరు రాకపోవడంతో అనధికారికంగా సేకరించుకోవాలని అభయం ఇచ్చారు. దీంతో అతడు వ్యర్థాలను సేకరించి అనకాపల్లి వైపు వెళుతుండగా నరవ వద్ద మూడు వాహనాలను జీవీఎంసీ అధికారులు పట్టుకున్నారు. వెంటనే సదరు నేత రంగంలోకి దిగి ఆ వాహనాలను విడిచిపెట్టకపోతే తీవ్రపరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. జోన్‌-2 పరిధిలోకి వచ్చే ఒక నియోజకవర్గ నేత వద్ద పీఏగా పనిచేసిన వ్యక్తే బినామీ పేరుతో చికెన్‌ వ్యర్థాల సేకరణ కాంట్రాక్టు దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నగరమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కూటమిలోని ఒక పార్టీ నేత ఒకరికి మద్దతుగా ఉంటే...మరో పార్టీ నేత మరొకరికి మద్దతుగా నిలుస్తున్నారు. నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ప్రభావం ప్రభుత్వంపై పడుతుందంటూ ఒక ప్రజా ప్రతినిధి నేరుగా జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి చికెన్‌ వ్యర్థాల టెండర్లను రద్దు చేయాలని కోరినట్టు సమాచారం.

Updated Date - May 27 , 2025 | 01:37 AM