గ్రేటర్‌లో చికెన్ వ్యర్థాల లొల్లి
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:24 AM
మహా విశాఖ నగర పాలక సంస ్థ(జీవీఎంసీ)లో చికెన్‌వ్యర్థాల సేకరణ వివాదం రోజురోజుకి ముదురుతోంది.
తరలింపు కోసం కాంట్రాక్టర్లకు ప్రైవేటు వ్యక్తుల మధ్య పోటీ
ఇరువర్గాలకు కూటమినేతల అండదండలు
ఒకరి వాహనాలను ఒకరు పట్టుకుని సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు
చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస ్థ(జీవీఎంసీ)లో చికెన్‌వ్యర్థాల సేకరణ వివాదం రోజురోజుకి ముదురుతోంది. చికెన్ వ్యర్థాలకు చేపల పెంపకందార్ల నుంచి భారీ డిమాండ్ ఉండడంతో వ్యర్థాల సేకరణకు జీవీఎంసీ నుంచి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతోపాటు కొందరు ప్రైవేటు వ్యక్తులు పోటీపడుతున్నారు. ఇరువర్గాలకు కూటమి నేతల అండదండలు ఉండడంతో ఒకరి వాహనాలను ఒకరు పట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డంపింగ్‌యార్డుకి కాకుండా చేపలచెరువులకు వ్యర్థాలను తరలించే వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనేమేషాలు లెక్కిస్తున్నారు. ఇది జీవీఎంసీ కార్పొరేటర్లు, అధికారుల్లో నిత్యం వివాదాలకు కారణంగా మారుతోంది.
జీవీఎంసీ పరిధిలో చికెన్ దుకాణాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను గెడ్డలు, రోడ్లపై పడేస్తుండడం వల్ల పారిశుధ్యలోపంతో పాటు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీనిని గుర్తించిన జీవీఎంసీ అధికారులు నగరంలోని చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను వాహనంలో సేకరించి, కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకి తరలించేందుకు రెండేళ్లకొకసారి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. చికెన్ వ్యర్థాలను చేపల చెరువుల్లో వేయడం వల్ల చేపలు తక్కువకాలంలోనే ఎక్కువ బరువు పెరుగుతున్నట్టు చేపలపెంపకందారులు గుర్తించారు. దీంతో అనకాపల్లి, దేవరాపల్లితోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోని చేపల చెరువులు యజమానులు నగరంలో చికెన్‌వ్యర్థాలను సేకరించేవారిని సంప్రదించారు. వ్యర్థాలను సరఫరా చేస్తే భారీగా డబ్బు ఇవ్వడానికి అంగీకరించడంతో కాంట్రాక్టర్లు వ్యర్థాలను డంపింగ్‌యార్డుకి కాకుండా చేపల చెరువులకు విక్రయించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లు ఈ వ్యవహారం గుట్టుగానే జరిగినప్పటికీ చికెన్‌వ్యర్థాలకున్న డిమాండ్ బయటకు తెలిసింది. దీంతో సేకరణకు పోటీపెరిగింది. కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలిస్తామని జీవీఎంసీతో అంగీకారం కుదుర్చుకున్నా చేపల చెరువులకే తరలించడంతో టెండర్లకు కొన్నేళ్లుగా పోటీపెరిగింది. వైసీపీ హయాంలో ఆపార్టీనేతలు తమ అనుచరులకు కోడివ్యర్థాల టెండర్లు అప్పగించి భారీగా ముడుపులు దండుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా టెండర్లు పిలిచి ఒక్కో జోన్‌కు ఒకరుచొప్పున ఎనిమిది జోన్లకు ఎనిమిది మంది కాంట్రాక్టర్లకు టెండరు అప్పగించారు. వీరిలో కొందరు చికెన్‌వ్యర్థాలను గతంలో మాదిరిగానే చేపల చెరువులకు విక్రయిస్తుండడంతో పెద్దఎత్తున దుమారం రేగింది. దీనిపై అధికారులు స్పందించి టెండర్లను రద్దుచేశారు. కాంట్రాక్టర్లు కోర్టుకి వెళ్లడంతో అధికారుల ఆదేశాలపై స్టే విధించింది. ఇదే అదనుగా గతంలో కోడివ్యర్థాల సేకరణలో అనుభవం కలిగిన వైసీపీకి చెందిన కొందరు నేతలు రౌడీషీటర్లను నియమించుకుని కాంట్రాక్టర్లకు పోటీగా చికెన్‌దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించడం ప్రారంభించారు. వీరికి కూటమిలోని కొందరు నేతలు అండగా నిలవడంతో కాంట్రాక్టర్లు, ప్రైవేటువ్యక్తులు రెండువర్గాలు విడిపోయారు. ఒకరి వాహనాలను ఒకరు పట్టుకుని జీవీఎంసీ గ్రూపులోనూ, కార్పొరేటర్లు, అధికారులు కలిసి ఉండే టీమ్ జీవీఎంసీ గ్రూపులోనూ పోస్ట్‌చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట అనకాపల్లి వద్ద రెండు వాహనాలు, సబ్బవరం వద్ద ఒకటి, గాజువాక, గోపాలపట్నంలో రెండేసి వాహనాలను పట్టుకుని అధికారులకు అప్పగించడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా రోజూ ఎక్కడో ఒకచోట చికెన్ వ్యర్థాల కోసం కొట్లాటలు, పోలీసు కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అన్నవరం వైపు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ఐదు వాహనాలను అనకాపల్లి వద్ద కొందరు పట్టుకుని టీమ్ జీవీఎంసీ గ్రూపుతోపాటు ఇతర వాట్సాప్‌గ్రూపుల్లో పోస్ట్‌చేసి దీనివెనుక ఉన్నవారెవరో తేల్చాలంటూ వీడియోలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా జీవీఎంసీ అధికారులు మాత్రం చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.