హాస్టళ్లకు హంగులు!
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:51 AM
గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసింది. శిథిల భవనాలు, అరకొర వసతుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ వసతి గృహాల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. గత వైసీపీ హయాంలో అధ్వానంగా తయారైన వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చర్యలు చేపడుతున్నారు.
సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు కొత్త రూపు
రూ.4.22 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
భవనాలకు మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన
బాలికల వసతిగృహాలకు ప్రహరీగోడలు
కొత్తగా మిక్సీలు, గ్రైడర్లు, వంటసామగ్రి
విద్యార్థులకు తొలగిన ఇబ్బందులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసింది. శిథిల భవనాలు, అరకొర వసతుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ వసతి గృహాల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. గత వైసీపీ హయాంలో అధ్వానంగా తయారైన వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో 21 ప్రీ-మెట్రిక్, ఆరు పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో 3,520 మంది, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో 845 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఆయా వసతి గృహాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయం, ప్రహరీ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.4.22 కోట్లు మంజూరు చేసింది. ఏపీ విద్యా మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సమగ్ర శిక్ష నిధులతో వసతి గృహాల భవనాలకు మరమ్మలు చేపట్టి కొత్త రూపు తెస్తున్నారు. అన్ని బాలికల వసతిగృహాలకు ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేశారు. విద్యార్థులు వుండే గదుల్లోకి దోమలు రాకుండా కిటికీలకు మెష్‌లు, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించారు.
సీఎస్‌ఆర్ నిధులతో..
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు రూ.70 లక్షలతో పలు వసతిగృహాలకు మరమ్మతు పనులు చేపట్టారు. కిటికీలు, తలుపులు కొత్తవి అమర్చారు. నిరుపయోగంగా మారిన 38 మరుగుదొడ్లను బాగు చేయించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి వసతిగృహానికి రూ.1.5 లక్షల చొప్పున కేటాయించి కొత్తగా మిక్సీలు, గ్రైండర్లు, వంట పాత్రలు సమకూర్చారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు
రామానందం, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, అనకాపల్లి
సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా బాలికల వసతి గృహాలకు రక్షణ చర్యల్లో భాగంగా ప్రహరీ గోడలు నిర్మించాం. ఐదో తరగతి లోపు విద్యార్థులకు ఉచితంగా నోట్‌పుస్తకాలు అందజేశాం. పిల్లలు తమ ఇళ్లల్లో వున్నట్టు భావించేలా వసతి గృహాలను తీర్చిదిద్దాం. మౌలిక వసతులు కల్పించడమే కాకుండా విద్యార్థుల చదువుతోపాటు క్రీడలు, యోగా కోసం ఏర్పాట్లు చేశాం.