మార్గదర్శుల కోసం మల్లగుల్లాలు!
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:44 PM
పేదలను ఉన్నత స్థితికి చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీ4 పథకానికి మార్గదర్శుల ఎంపికకు అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. రాష్ట్రంలోనే అత్యధిక పేదలున్న జిల్లాగా అల్లూరి జిల్లా గుర్తింపు పొందింది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఆశించిన స్థాయిలో మార్గదర్శిలు ముందుకు రావడం లేదు.
జిల్లాలో మందకొడిగా పీ4 అమలు
వెనుకబడిన జిల్లా కావడమే కారణం
కనీసం స్పందించని ప్రజాప్రతినిధులు, నేతలు
జిల్లా వ్యాప్తంగా 92,683 పేద కుటుంబాలు
నేటికి 16,050 కుటుంబాలు దత్తత
ఇంకా 76,673 కుటుంబాలకు మార్గదర్శుల అవసరం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధిక పేదలున్నారు. పీ4 అమల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే సచివాలయాల వారీగా పేదకుటుంబాలను గుర్తించారు. జిల్లాలోని 22 మండలాల్లో 352 గ్రామ సచివాలయాల పరిధిలో 2,95,500 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 92,683 కుటుంబాలు, 3,13,041 మంది సభ్యులను పేదలుగా గుర్తించారు. వారందరిని అన్ని విధాలా అభివృద్ధిలోకి తెచ్చేందుకు మార్గదర్శిలను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే జిల్లాలో పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, ధనికులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శిలు కరవుయ్యారు. అయినప్పటికీ అధికారుల పరిచయాలతో ఇప్పటికి 16,050 కుటుంబాలను దత్తత తీసుకునేలా మార్గదర్శిలను గుర్తించారు. అయినా ఆశించిన స్థాయిలో పీ4 ప్రగతి సాధించలేకపోతోంది.
మార్గదర్శిలుగా ఐఏఎస్ అధికారులు
తమను స్ఫూర్తిగా తీసుకుని పీ4లో పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఎవరైనా వస్తారనే ఆలోచనలో జిల్లాలోని ఐఏఎస్ అధికారులు మార్గదర్శిలుగా మారారు. పాడేరు మండలం ఐనాడ పంచాయతీ కేంద్రానికి చెందిన వంతిని సాంబశివ, అతని కుమార్తె మానసను జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ దత్తత తీసుకుని, ఆమె ఉన్నత విద్యకు, తండ్రి సాంబశివకు ఆరోగ్య, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే పెదబయలు మండలం పొయిపల్లి పంచాయతీ సైలంకోటకి చెందిన జర్సింగి తెల్లన్న, ఆయన కుమార్తె రమాదేవిలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ దత్తత తీసుకోగా, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్ తన కార్యాలయంలోని స్వీపర్‌గా పనిచేస్తున్న ఫాతిమా కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు.
కనీసం స్పందించని ప్రజాప్రతినిధులు, నేతలు
పేదల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 పథకంపై ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు కనీసం స్పందించలేదు. ఎన్నికలు, ఇతర సమయాల్లో పేదలను ఉద్ధరిస్తామనే ఊదరగొట్టే వారంతా పీ4లో భాగస్వామ్యం కాకపోవడం విశేషం. వాస్తవానికి జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర రాజకీయ నేతలు సైతం మార్గదర్శులుగా మారి పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని ఆ దిశగా జిల్లాలో ఒక్క ప్రజా ప్రతినిధిగాని, నేతగాని ముందుకు అడుగులు వేయలేదు. ఇకనైనా పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శిలు ముందుకు వచ్చి పలువురికి స్ఫూర్తిగా నిలవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
జిల్లాలో పీ4కు సంబంధించిన వివరాలు
ు జిల్లాలో మొత్తం కుటుంబాలు: 2,95,500
ు గుర్తించిన పేద కుటుంబాలు: 96,683
ు పేదకుటుంబాల్లోని సభ్యులు: 3,13,041 మంది
ు ఇప్పటివరకు దత్తత తీసుకున్న కుటుంబాలు: 16,050
ు దత్తత తీసుకున్న కుటుంబాల్లోని సభ్యులు: 1,24,557 మంది
ు ఇంకా దత్తత తీసుకోవాల్సిన కుటుంబాల సంఖ్య: 76,673