Share News

చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్ల హవా!

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:02 AM

పౌర సరఫరాల శాఖ జిల్లా కార్యాలయంలో పలువురు చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు హల్‌చల్‌ చేస్తున్నారు.

చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్ల హవా!

  • పౌరసరఫరాల శాఖలో ఇష్టారాజ్యం

  • ఒక ఇన్‌స్పెక్టర్‌కు 80 డిపోల పర్యవేక్షణ

  • మంత్రి, అధికార పార్టీ నేత బంధువులమంటూ హల్‌చల్‌

  • ఇదే శాఖలో ఏళ్లతరబడి పలువురు తిష్ఠ

  • నెలవారీ మామ్మూళ్లు, అథంటికేషన్‌కు వసూళ్లు

  • బియ్యం అక్రమ వ్యాపారంపై నిఘా శూన్యం

విశాఖపట్నం/గాజువాక/ఆరిలోవ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

పౌర సరఫరాల శాఖ జిల్లా కార్యాలయంలో పలువురు చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు హల్‌చల్‌ చేస్తున్నారు. నగరంలో ఎక్కువమంది బినామీ రేషన్‌ డీలర్లుండడం... కార్డుదారుల్లో అధిక శాతం మంది బియ్యం విక్రయిస్తుండడంతో రూ.కోట్లలో అక్రమ వ్యాపారం జరుగుతోంది. వీటిని అరికట్టాల్సిన చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు మామ్మూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని నాలుగు మండలాలు, నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్న 643 రేషన్‌ డిపోలలో 5.29 లక్షల బియ్యం కార్డులున్నాయి. ప్రతినెలా ఎనిమిది వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నగరంలో జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌కు 15 నుంచి 20, సీనియర్‌కు 20 నుంచి 30 డిపోల పర్యవేక్షణ బాధ్యతలుంటాయి. కాగా అధికార పార్టీలో మంత్రి, కీలక పార్టీ నేత బంధవులమంటూ కొందరు చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ ఏకంగా 80కు పైగా రేషన్‌ డిపోలను పర్యవేక్షిస్తున్నారు.

మరో చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సెలవులో ఉన్నారు. అయినప్పటికీ తాను పనిచేసే సర్కిల్‌-2లో కర్రపెత్తనం చెలాయిస్తున్నారని, నెలవారీ మామూళ్లను ఎంచక్కా వసూలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో డ్వాక్రా సంఘం నిర్వహించే ఒక డిపో వ్యవహారంలో అప్పటి డీఎస్‌వోను మేనేజ్‌ చేసి మరొకరికి అప్పగించారు. దీనిపై డ్వాక్రా సంఘం కోర్టుకు వెళ్లడంతో మరో డీలర్‌కు అటాచ్‌ చేసే వ్యవహారంలో సెలవులో ఉన్న ఇన్‌స్పెక్టరు తాజాగా పంచాయితీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కొందరు చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు నగరంలో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు. పైరవీలు సాగిస్తూ మాతృశాఖ రెవెన్యూకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. రాజకీయ నేతల సిఫారసులు, రెవెన్యూ సంఘం జోక్యంతో పౌరసరఫరాల శాఖలోనే కొనసాగడానికి వారు మొగ్గు చూపుతున్నారు. ఇదిలావుండగా రేషన్‌ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల నుంచి ఇన్‌స్పెక్టర్లకు నెలవారీ మామ్మూళ్లు అందుతాయన్నది బహిరంగ రహస్యం. ఒరిజినల్‌ డీలర్‌ రూ.1000, ఎండీయూ రూ.500, బినామీ డీలర్‌ రూ.2 వేల వరకు సమర్పించుకుంటారనే ఆరోపణలున్నాయి. ప్రొటోకాల్‌ ఖర్చుల కోసమంటూ వసూలు చేస్తున్నారని గాజువాకకు చెందిన డీలర్లు చెబుతున్నారు. ప్రతి రెండేళ్లకు (2025 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2027 మార్చి 31 వరకు) ఒకసారి ప్రతి రేషన్‌ డిపోను అథంటికేషన్‌ చేసుకోవాలి. అంటే డీలర్‌ ఒరిజినల్‌ ఆర్డర్‌, రూ.500 చలానా, దరఖాస్తు పూర్తి చేసి పౌరసరఫరాల శాఖకు అందజేయాల్సి ఉంటుంది. దీనికి కూడా కొందరు ఇన్‌స్పెక్టర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని వన్‌టౌన్‌కు చెందిన పలువురు డీలర్లు చెబుతున్నారు. ఇదిలావుండగా నగరం నుంచి వేల టన్నుల బియ్యం శివారు ప్రాంతాలకు తరలిపోతుంటాయి. వీటిని పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు పట్టుకుని పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తుంటారు. ఈ పని చేయాల్సిన చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు మాత్రం బియ్యం అక్రమ తరలింపుదారుల నుంచి భారీగా వసూలు చేస్తుంటారని సమాచారం.

సివిల్‌ సప్లయ్‌ శాఖలో ఆ ఉద్యోగిదే పెత్తనం

సెలవులో ఉన్నా డీలర్లు, ఎండీయూలకు బెదిరింపు

కలకలం రేపిన ఆడియో మెసేజ్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖపై ఓ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నారు. ఏకంగా డీలర్లు, ఎండీయూలను బెదిరించే ఆడియో లీక్‌ కావడంతో కలకలం రేపింది. రైల్వే న్యూకాలనీ ఏరియాలో డిపో నంబర్‌-40 డీలర్‌ వ్యవహారంపై వివాదం కొనసాగుతుంది. రెండు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో సమీపంలోని డిపో నంబరు-19కి డిపో-40ను అటాచ్‌ చేశారు. ఈ డిపోతో పాటు ఇసుకతోట ఏరియాలోని డిపో-546కు ఒక ఎండీయూకు బియ్యం పంపిణీ చేసే బాధ్యతను అప్పగించారు. ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఎండీయూ ఇసుకతోటలో డిపో-546 పరిఽధిలో కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసి ఆరో తేదీ నుంచి డిపో-40 పరిఽధిలోని లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. ఈ విషయం పౌరసరఫరాల శాఖలో చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి సంబంధిత అధికారులకు తెలుసు. కాగా రైల్వే న్యూకాలనీకి చెందిన పలువురు కార్డుదారులు ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్‌ చేసి ఎండీయూ తమకు సరకులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారట. అటువంటప్పుడు విధుల్లో ఉన్న చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వాస్తవాలు చెప్పి వివరణ ఇచ్చుకోవచ్చు. అందుకు భిన్నంగా సెలవులో ఉన్న చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీయూ/డీలర్ల గ్రూప్‌లో ఒక ఆడియో మెసేజ్‌ పెట్టారు. ‘రైల్వే న్యూకాలనీలో పలు వీధులకు రైస్‌ బండి వెళ్లడం లేదని, వెంటనే స్పందించకపోతే జేసీతో చెప్పించి డీలర్‌/ఎండీయూను సస్పెండ్‌ చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు’ అంటూ ఆడియో మెసేజ్‌ పెట్టారు. సెలవులో ఉన్న చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేనిపోని పెత్తనం చేస్తున్నారని డీలర్లు/ఎండీయూలు వ్యాఖ్యానిస్తున్నారు. సెలవులో ఉన్న చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రతినెలా మామూళ్లు తీసుకుంటున్నారని, ఈ విషయం ప్రస్తుత ఇన్‌స్పెక్టర్‌కు తెలుసునని పేర్కొంటున్నారు. గతంలో విధులు నిర్వహించినప్పుడు కూడా ఈయన పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో పెత్తనం చెలాయించేవారని డీలర్ల సంఘం నేత ఒకరు తెలిపారు. గతంలో పనిచేసిన డీఎస్‌వో దన్నుతో తానే డీఎస్‌వోనన్న దర్పం చూపుతూ కొందరు ఇన్‌స్పెక్టర్లతో కలిసి భారీగా వసూళ్లకు పాల్పడేవారని ఆరోపించారు. సెలవులో ఉన్నప్పటికీ సదరు చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ డీలర్లు/ఎండీయూ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పోస్టులు పెట్టడం గురించి అధికారులకు తెలిసినా ఎందుకు మౌనం దాల్చుతున్నారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 07 , 2025 | 12:02 AM