Share News

ఉక్కు కార్మికుల దీక్షలకు చెక్‌

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:17 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఉక్కు కార్మికుల దీక్షలకు చెక్‌

ఆ స్థలం ప్లాంటుకు చెందినదని, అక్కడకు ఎవరూ రాకూడదని

హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసిన యాజమాన్యం

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లుగా కార్మికులు దీక్షలు నిర్వహిస్తున్న స్థలం ప్లాంటుకు చెందినదని, అందులోకి ఎవరూ ప్రవేశించకూడదని శుక్రవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసింది. ఆ లోపలకు ఎవరూ వెళ్లకుండా రెండు రోజుల్లో ముళ్లకంచె కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం.

కార్మికులు కూర్మన్నపాలెంలో స్టీల్‌ప్లాంటు స్వాగతద్వారం వద్ద నాలుగేళ్లుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరణ చేయకూడదని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ అక్కడ శిబిరం ఏర్పాటుచేశారు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులు వస్తే సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మాట సాయంతో పాటు ఆర్థిక సాయం కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వంతో రూ.11,450 కోట్లు ఇప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో మరో రూ.2 వేల కోట్ల సాయం చేయడానికి అంగీకరించింది. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో పనిచేయించడానికి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ప్రారంభించే ఏర్పాట్లు చేశారు.

ఇదిలావుండగా ఆర్థిక భారం తగ్గించుకోవడానికంటూ కొందరికి యాజమాన్యం వీఆర్‌ఎస్‌ ఇచ్చింది. అదేవిధంగా మూడు, నాలుగు వేల మంది కాంట్రాక్టు వర్కర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీనిని యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేసినా ఇంకా ఆందోళనలు, దీక్షలు చేయడం ఏమిటని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పటికిప్పుడు ప్లాంటును ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉంటే వేల కోట్ల సాయం ఎందుకు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఏళ్ల తరబడి ఆందోళన సాగిస్తున్న కొన్ని కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు ఉధృతం చేశాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు దీక్షా శిబిరం కూలిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ శిథిలాలను తొలగించి, ఆ భూమి స్టీల్‌ ప్లాంటుదని, అక్కడ ఎవరూ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని యాజమాన్యం బోర్డు పెట్టింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే బీఎఫ్‌-3 కోసం పనిచేస్తారా?, లేక కొత్త శిబిరం ఏర్పాటుపై దృష్టి పెడతారా? అనేది చూడాలి.

జూలై 9న సమ్మె

ఉక్కు యాజమాన్యానికి కార్మిక సంఘ నాయకుల నోటీస్‌

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించరాదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జూలై 9వ తేదీన సమ్మె చేస్తామంటూ జీఎం (హెచ్‌ఆర్‌) మధుసూదనరావుకు అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు శుక్రవారం నోటీస్‌ అందజేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు స్టీల్‌ప్లాంటులో సమ్మె చేయనున్నట్టు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులను తొలగించరాదనే డిమాండ్‌లతో సమ్మె చేస్తున్నామని నోటీసులో పేర్కొన్నారు. సమ్మె నోటీస్‌ అందజేసిన వారిలో అఖిలపక్ష నాయకులు డి.ఆదినారాయణ, కేఎస్‌ఎన్‌ రావు, పీవీ రమణమూర్తి, యు.రామస్వామి, చీకటి శ్రీనివాస్‌, ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 01:17 AM