Share News

రైలు పట్టాలపై ప్రయాణికుల రాకపోకలకు చెక్‌

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:33 PM

ప్రమాదాల నివారణలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా రైల్వే అధికారులు చెక్‌ పెట్టారు.

రైలు పట్టాలపై ప్రయాణికుల రాకపోకలకు చెక్‌
గూడ్స్‌ షెడ్డు వైపు ప్రహరీ గోడ నిర్మించిన దృశ్యం

గూడ్స్‌ షెడ్డు వైపు ప్రహరీ గోడ నిర్మాణం

ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అధికారుల చర్యలు

అనకాపల్లిటౌన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాల నివారణలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా రైల్వే అధికారులు చెక్‌ పెట్టారు. ముఖ్యంగా గూడ్స్‌ షెడ్డు వైపు భారీ ప్రహరీ గోడ నిర్మించారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో తెరిచేందుకు గూడ్స్‌ షెడ్డు వద్ద రెండు, మూడు ప్లాట్‌ఫారాలకు వెళ్లే మార్గంలో గేటును కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి రైలు పట్టాలపై రాకపోకలు సాగించకూడదని రైల్వే చట్టం చెబుతోంది. అందుకనే ప్రయాణికుల సౌకర్యార్థం గూడ్స్‌ షెడ్డు వైపు నాటి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్లతో కాలినడక వంతెన ఏర్పాటు చేశారు. వంతెన పైనుంచే ప్రయాణికులు 2, 3 ప్లాట్‌ఫారాలకు రాకపోకలు సాగించాలని రైల్వే అధికారులు గూడ్స్‌ షెడ్డు వైపు స్టీల్‌ గడ్డర్లు వేసినా ప్రయాణికులు మాత్రం రైల్వే ట్రాక్‌ మీదుగానే ప్లాట్‌ఫారాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల గతంలో పలువురు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. వాస్తవానికి అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు అత్యధిక శాతం ప్రయాణికులు నాయిళ్లు వీధి మీదుగా గూడ్స్‌ షెడ్డు వైపు స్టేషన్‌కు చేరుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కాలినడక వంతెన ఏర్పాటు చేసినా సులువు మార్గమని పట్టాలు దాటుతున్నారే తప్ప వంతెన ఉపయోగించుకోవడం లేదు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనుల్లో భాగంగా 1వ నంబరు ప్లాట్‌ఫారం నుంచి గూడ్స్‌ షెడ్డు చివరి వరకు ప్రహరీ గోడ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు.

Updated Date - Nov 30 , 2025 | 11:33 PM