Share News

కబ్జాదారులకు చెక్‌

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:08 AM

ఆనందపురం మండలం గండిగుండం గ్రామ రెవెన్యూ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల స్వాధీనానికి అధికారులు నడుంబిగించారు.

కబ్జాదారులకు చెక్‌

గండిగుండంలో ప్రజాప్రతినిధి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి స్వాధీనం

మరికొన్ని ఆక్రమణలో ఉన్నట్టు ఫిర్యాదులు

విచారణ చేపట్టిన అధికారులు

విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం గండిగుండం గ్రామ రెవెన్యూ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల స్వాధీనానికి అధికారులు నడుంబిగించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి, ఆయన కుటుంబం ఆధీనంలో ఉన్న భూముల వివరాలు సేకరించిన అధికారులు తొలుత సర్వే నంబర్‌ 212-1లో గల ఎకరా భూమిని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఈ భూమి విలువ సుమారు ఐదారు కోట్ల రూపాయలు ఉంటుంది. చాలాకాలంగా సదరు ప్రజా ప్రతినిధి ఆధీనంలో ఉన్న ఎకరా భూమిలో సరుగుడు వేశారు. ఇటీవల తోటలు నరికేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయం గ్రామ రెవెన్యూ అధికారులుగా పనిచేసిన వారికి తెలిసినప్పటికీ లంచాలు తీసుకుని చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గండిగుండంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు కదిలారు. సర్వే నంబర్‌ 212-1లో ఎకరా భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. కాగా ఆ ప్రాంతంలో సుమారు ఆరేడు ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. ఒకే కుటుంబంలో మైనర్ల పేరిట గతంలో డీపట్టాలు తీసుకున్నారు. ఇంకా ఇనాం భూమి స్వాధీనం చేసుకుని సహకార సొసైటీ నుంచి రుణం తీసుకున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. అలాగే గెడ్డ వాగు కబ్జా చేయడంతో వర్షాకాలంలో నీరు గ్రామంపైకి వస్తోందని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి ఉపయోగించుకుని ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేయించిన ప్రజా ప్రతినిధిపై ప్రస్తుత రెవెన్యూ అధికారులు విచారణకు నిర్ణయించారు. త్వరలో మరికొన్ని ఆక్రమణలను గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:08 AM