Share News

రహదారి కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:08 PM

సీలేరు అంతర్‌ రాష్ట్ర ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. రహదారి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధులు(ఎస్‌డీఎంఎఫ్‌) రూ.18.95 కోట్లు విడుదల చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు.

రహదారి కష్టాలకు చెక్‌
గోతులతో దారుణంగా ఉన్న జీకేవీధి కాలనీ రహదారి(ఫైల్‌)

పాలగెడ్డ- ఆర్‌వీనగర్‌ రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

రూ.18.95 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం

తీరనున్న వాహనచోదకుల ఇబ్బందులు

చింతపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సీలేరు అంతర్‌ రాష్ట్ర ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. రహదారి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధులు(ఎస్‌డీఎంఎఫ్‌) రూ.18.95 కోట్లు విడుదల చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. మూడు నెలల్లో రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చిన నెలల వ్యవధిలోనే నిధులు మంజూరుకావడం, పనులు ప్రారంభించడంపై ఈ ప్రాంత ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీలేరు- చింతపల్లి ప్రధాన రహదారి నాలుగు రాష్ట్రాలను కలుపుతున్నది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ప్రజలు ఈ రహదారి మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ రహదారి ఎనిమిదేళ్ల క్రితం ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు ఛిద్రమైంది. దీంతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 2016-17లో ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు 78 కిలోమీటర్లు రహదారి విస్తరణ, పునర్నిర్మాణం కోసం రూ.84 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో రహదారి నిర్మాణాలకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి, అటవీశాఖ అనుమతుల కోసం టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. అటవీశాఖ అనుమతులు జాప్యం కావడం వల్ల పనులు ప్రారంభంకాలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రహదారి నిర్మాణానికి విడుదల చేసిన నిధులు, టెండర్‌ను రద్దు చేసింది. దీంతో గత ఐదేళ్లుగా ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు రహదారి నిర్మాణం కలగా మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన రహదారి ఛిద్రమైంది. ఎక్కడా రహదారి ఆనవాళ్లు కనిపించడం లేదు. పలు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే వాహనచోదకులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. కాగా గత కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చొరవతో ఛిద్రమైన 78 కిలోమీటర్ల రహదారిలో 29 కిలోమీటర్ల మేర ఉపాధి హామీ నిధులతో తారు రోడ్డు నిర్మించారు. అయితే 2024 సెప్టెంబరు 8వ తేదీన కురిసిన వర్షానికి ఈ రహదారి కొట్టుకుపోయింది. పలు చోట్ల రహదారి పూర్తిగా కోతకు గురికాగా, కల్వర్టులు కూడా కొట్టుకుపోయాయి. సంపంగిగొంది నుంచి సీలేరు వరకు పలు చోట్ల రహదారి ఛిద్రం కావడంతో పది రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. సెప్టెంబరు 10న జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి స్వయంగా ఈ రహదారిని పరిశీలించి ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు 49 కిలోమీటర్ల రహదారి పునర్నిర్మాణానికి రూ.18.95 కోట్లు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు రహదారి నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు మంజూరయ్యాయి. అలాగే 2016-17 ప్రాంతంలో టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించడం వలన పనులు ప్రారంభించేందుకు కొంత జాప్యం జరిగింది. న్యాయపరమైన అడ్డంకులు నెల రోజుల క్రితం తొలగిపోయాయి. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రెండు రోజుల క్రితం రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ముందుగా రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్చే పనులు చేపడుతున్నారు. నెలాఖరు నుంచి రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఈ రహదారి నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ సీలేరు, చింతపల్లి ఏఈఈలు బి.భరతుడు, బి.జయరాజు తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 11:08 PM