Share News

రేషన్‌ అక్రమాలకు చెక్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:27 AM

రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా పనిపట్టడానికి ప్రభుత్వం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు ‘రెడ్‌’ సిగ్నల్‌ వేసింది. అధికారుల తనిఖీల్లో ఎక్కడైనా బియ్యం పట్టుబడితే అవి రేషన్‌ బియ్యమా? కాదా? అన్నది నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకంగా ర్యాపిడ్‌ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అక్రమార్కులపై అక్కడికక్కడే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకువాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది.

రేషన్‌ అక్రమాలకు చెక్‌
తనిఖీ కిట్‌ను చూపిస్తున్న డీఎస్‌ఓ కేవీఎల్‌ఎన్‌ మూర్తి

బియ్యం మాఫియా కట్టడికి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు

పౌరసరఫరాల శాఖకు ప్రత్యేక కిట్లు

పట్టుబడిన బియ్యానికి ద్రావకంతో పరీక్ష

బియ్యం ఎరుపు రంగులోకి మారితే ప్రభుత్వం సరఫరా చేసిన సరుకుగా నిర్ధారణ

అప్పటికప్పుడే కేసులు నమోదు

బియ్యంతోపాటు రవాణా చేస్తున్న వాహనాలు సీజ్‌

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా పనిపట్టడానికి ప్రభుత్వం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు ‘రెడ్‌’ సిగ్నల్‌ వేసింది. అధికారుల తనిఖీల్లో ఎక్కడైనా బియ్యం పట్టుబడితే అవి రేషన్‌ బియ్యమా? కాదా? అన్నది నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకంగా ర్యాపిడ్‌ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అక్రమార్కులపై అక్కడికక్కడే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకువాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది.

చౌక ధరల దుకాణాల ద్వారా పేద వర్గాలకు ఉచితంగా అందించే బియ్యం చాలా వరకు పక్కదారి పడుతున్నది. బియ్యం లావుగా వుండడంతో కార్డుదారుల్లో పలువురు రేషన్‌ బియ్యాన్ని వినియోగించడానికి ఆసక్తి చూపడంలేదు. ఇదే అదనుగా భావించి కొంతమంది దళారుల అవతారం ఎత్తారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి కార్డుదారుల నుంచి రేషన్‌ బియ్యం కిలో రూ.15కి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది రైషన్‌ డీలర్లు కూడా కార్డుదారులకు డబ్బులు ఇచ్చి, బియ్యం తమవద్దనే ఉంచేసుకుంటున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రైస్‌ మిల్లర్లకు కిలో రూ.18-20 చొప్పున అమ్ముతున్నారు. మిల్లుల్లో వాటిని మరోసారి పాలిష్‌పట్టించి, కిలో రూ.40-45 చొప్పున వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. కిరాణా దుకాణాల్లో ఇవే బియ్యం రూ.50-55కి విక్రయిస్తున్నారు. ఇదో పెద్ద మాఫియాలా సాగుతోంది. గత కొన్నేళ్ల నుంచి.. ముఖ్యంగా వైసీపీ హయాంలో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం భారీఎత్తున సాగింది. పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం ఆగడంలేదు. ఒకవేళ పట్టుబడితే 6ఏ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇది సాధారణ కేసు కావడంతో అక్రమార్కులు వెనకడుగు వేయడంలేదు.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాలు, విజిలెన్స్‌ అధికారులు పలుచోట్ల రైస్‌ మిల్లులు, గోదాములపై దాడులు నిర్వహించి లక్షలాది టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గతంలో మాదిరిగా లావు బియ్యం కాకుండా.. పోషక విలువలతో కూడిన ఫార్టిఫైడ్‌ రైస్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. అయినప్పటికీ రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

అక్రమాలకు చెక్‌

రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఎనిమిది మంది పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లకు మొబైల్‌ ర్యాపిడ్‌ కిట్లను అందజేసింది. ఒక్కో కిట్‌లో పొటాషియం థయో సైనైడ్‌, హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ వుంటాయి. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్టు సమాచారం వచ్చినా, లేకపోతే అనుమానం వచ్చినా వెంటనే రంగంలోకి దిగుతారు. బస్తాల్లో నుంచి బియ్యం శాంపిల్స్‌ తీసి, తమ వద్ద ఉన్న కిట్లలోని ద్రావణాన్ని చల్లుతారు. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం అయితే.. ద్రావణం చల్లిన కొద్దిసేపటికే ప్రతి వంద గ్రాముల్లో 5-6 గ్రాముల బియ్యం ఎరుపు రంగులోకి మారతాయి. అదే మార్కెట్‌లో విక్రయించే బియ్యం అయితే రంగు మారదు. ఎరుపు రంగులోకి మారితే వెంటనే అక్రమార్కులపై కేసు నమోదు చేసి, బియ్యంతోపాటు వాహనాలను సీజ్‌ చేస్తారు. అయితే ర్యాపిడ్‌ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో రేషన్‌ మాఫియా కొత్త దారులను వెతుకుతున్నట్టు తెలిసింది.

కిట్లతో తనిఖీలు చేస్తున్నాం

కేవీఎల్‌ఎన్‌ మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి

రేషన్‌ బియ్యాన్ని కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారు. ఇటువంటి వాటిని అడ్డుకొనేందుకే ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి 100 కిలోల బియ్యంలో ఒక కిలో మల్టీవిటమిన్‌ మిక్స్‌, ఐరన్‌తో కూడిన బియ్యాన్ని కలుపుతారు. తనిఖీలు చేసినప్పుడు బియ్యం శాంపిల్స్‌ తీసి, వాటిపై కిట్లలోని ద్రావణాన్ని చల్లుతారు. బియ్యం రంగు మారితే రేషన్‌ డిపోలకు సరఫరా చేసిన బియ్యంగా నిర్ధారించి కేసులు పెడతాం. కొత్త తరహా కిట్లతో ఇప్పటికే తనిఖీలు జరుగుతున్నాయి.

Updated Date - Nov 08 , 2025 | 12:27 AM