ఉపాధిలో అక్రమాలకు చెక్
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:09 AM
ఉపాధి హామీ పథకం పనుల్లో దొంగ మస్తర్లకు చెక్ పడనుంది. జాబ్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని, లేకపోతే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉపాధి పనులు చేయడానికి వీలుకాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు డ్వామా అధికారులు, జిల్లాలోని ఉపాధి కూలీలతో ఈకేవైసీ చేయిస్తున్నారు.
ముఖ ఆధారిత హాజరుకు కేంద్రం చర్యలు
కూలీలకు ఈకేవైసీ తప్పనిపరి
పని ప్రదేశంలో రోజూ రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు
జిల్లాలో ఇంతవరకు 75 శాతం మేర నమోదు పూర్తి
వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు?
జాబ్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరి
కోటవురట్ల అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పనుల్లో దొంగ మస్తర్లకు చెక్ పడనుంది. జాబ్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని, లేకపోతే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉపాధి పనులు చేయడానికి వీలుకాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు డ్వామా అధికారులు, జిల్లాలోని ఉపాధి కూలీలతో ఈకేవైసీ చేయిస్తున్నారు.
గ్రామాల్లో పొలం పనులు లేనప్పుడు వ్యవసాయ కూలీలు వలస పోకుండా వుండడానికి సొంతూరునలోనే ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రెండు దశాబ్దాల క్రితం ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గ్రామాల్లో వ్యవసాయ కూలీలే కాకుండా సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు కూడా ప్రభుత్వం జాబ్ కార్డులు జారీ చేసింది. ఏటా జనవరి నుంచి జూన్ వరకు చెరువులు, పంట కాలువల్లో పూడికతీత, కొండవాలు ప్రదేశాల్లో కాంటూరు కందకాల తవ్వకం వంటి పనులు చేయిస్తుంటారు. అయితే కొంతమంది అధికార, రాజకీయ పలుకుబడి ఉపయోగించి, ఉపాధి పనులకు వెళ్లకుండానే కూలి డబ్బులు పొందుతున్నారు. మరికొంతమంది వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ, సొంతూరులో ఉపాధి పనులకు వెళుతున్నట్టు మస్తర్లు వేయించుకుని డబ్బులు స్వాహా చేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఉపాధి పథకం ఫీల్డు సిబ్బంది, ఉద్యోగులు కలిసి తప్పుడు మస్తర్లు వేసి నిధులు స్వాహా చేస్తున్నారు. ఇటువంటి అక్రమాలు సామాజిక తనిఖీల్లో పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. జాబ్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ ఇకపై ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి. ఇందుకోసం ఈకేవైసీ చేయించాలని డ్వామా అధికారులను ఆదేశించింది. దీంతో ఈ నెల నాలుగో తేదీ నుంచి ఉపాధి కూలీలకు ఈకేవైసీ నమోదు చేస్తున్నారు. జాబ్ కార్డులు వున్న ప్రతి ఇంటికీ వెళ్లి, ఆయా వ్యక్తుల ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేస్తున్నారు. అనంతరం మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌తో వారి ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఇది సెంట్రల్ సర్వర్‌లో నమోదు అవుతుంది. పనిలోకి వచ్చిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్‌తో ముఖ ఆధారిత హాజరు నమోదు చేయించుకోవాలి. సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి హాజరు నమోదు చేయాలి. లేకపోతే పనికి రానట్టు లెక్క. ఈ విధానం నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం వుందని సమాచారం. జిల్లాలో ఇంతవరకు 75 శాతం మేర ఈ ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.