హోటళ్లకు చెక్
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:07 AM
నగరంలో కొత్తకొత్త హోటళ్లు, రెస్టారెంట్‌లు వెలుస్తున్నాయి. అయితే అత్యధిక శాతం నాణ్యత లేని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందజేస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు హోటళ్లలో ఆహార నాణ్యతపై దృష్టిసారించారు. గత నెల రోజుల్లో 302 హోటళ్లలో తనిఖీలు చేయగా, 173 హోటళ్లలో నిల్వ చేసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తించి జరిమానాలు విధించారు.
ఆహార నాణ్యతపై జీవీఎంసీ దృష్టి
జోన్‌కు రెండు చొప్పున శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ ఏర్పాటు
గత నెల రోజుల్లో 302 హోటళ్ల తనిఖీ
కల్తీ, నిల్వ ఆహారం విక్రయిస్తున్న
173 హోటళ్లకు జరిమానా
మరో 16 ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు కమిషనర్ యోచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో కొత్తకొత్త హోటళ్లు, రెస్టారెంట్‌లు వెలుస్తున్నాయి. అయితే అత్యధిక శాతం నాణ్యత లేని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందజేస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు హోటళ్లలో ఆహార నాణ్యతపై దృష్టిసారించారు. గత నెల రోజుల్లో 302 హోటళ్లలో తనిఖీలు చేయగా, 173 హోటళ్లలో నిల్వ చేసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తించి జరిమానాలు విధించారు.
నగరంలో అధికారుల అంచనా ప్రకారం హోటళ్లు 500 వరకూ ఉన్నాయి. ఇవికాకుండా రోడ్డు మార్జిన్లు, కూడళ్ల వద్ద తోపుడుబండ్లు, వాహనాల మీద ఫాస్ట్ ఫుడ్ విక్రయించేవారు మరో వెయ్యి మంది వరకూ ఉండవచ్చునని అంచనా. వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో తక్కువ ధరకే ఆహారాన్ని అందించేందుకు నాణ్యతలేని పదార్థాలతో చేసిన వంటకాలు కస్టమర్లకు విక్రయిస్తున్నారు. రుచి కోసం రసాయనాలను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇంకా మిగిలిన పోయిన పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నారు. అలాంటి ఆహారం తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు దరిచేరుతున్నాయి. హోటళ్లలో ఆహార నాణ్యతను పర్యవేక్షించేందుకు ఆహార భద్రత, ప్రమాణాల విభాగం అధికారులు పనిచేస్తున్నప్పటికీ సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల ఆశించిన స్థాయిలో తనిఖీలు నిర్వహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్‌గార్గ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆహార నియంత్రణ మండలి, ప్రజారోగ్యం, వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (షీ) టీమ్స్‌ను ఏర్పాటుచేశారు. ఒక్కో జోన్‌కు రెండేసి చొప్పున ఎనిమిది జోన్లలో 16 బృందాలను గత నెల పదో తేదీన నియమించారు. ఆయా బృందాలు తమ జోన్ పరిధిలోని హోటళ్లు, స్టార్ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు వెళ్లి ఆహార నాణ్యత, వంటకు వాడే సామగ్రి నాణ్యత, వంటగదిలో పరిశుభ్రత వంటి అంశాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా నాణ్యత లేని పదార్థాలను వాడుతున్నట్టు గుర్తించినా, నిల్వ ఉంచిన ఆహారం, చికెన్, మటన్, చేపలను కస్టమర్లకు వడ్డిస్తున్నా వారిపై కేసులు నమోదుచేసి కనీసం రూ.పది వేలకు తగ్గకుండా జరిమానా విధించాలని ఆదేశించారు. గత నెల పది నుంచి ఈనెల తొమ్మిది వరకు షీటీమ్స్ 302 హోటళ్లలో తనిఖీలు చేసి 173 హోటళ్లకు రూ.2.71 లక్షల జరిమానా విధించాయి. షీటీమ్స్ ఏర్పాటైన తర్వాత హోటళ్ల ధోరణిలో మార్పు మొదలైనట్టు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తుండడంతో అదనంగా మరో 16 బృందాలను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్టు కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు.
స్టార్ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైంది
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
నేను కుటుంబంతో కలిసి నగరంలోని ఒక స్టార్ హోటల్‌కు వెళ్లాను. అక్కడ టీ తాగేందుకు కంటెయినర్ వద్దకు వెళ్లాను. గాజు కంటెయినర్ లోపల టీ పొడి చుట్టూ ఫంగస్ పేరుకుపోయి కనిపించింది. వెంటనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను పిలిచి నమూనాలు సేకరించి పరీక్ష చేయించాను. అక్కడున్న టీపొడిలో రంగు కలిపినట్టు పరీక్షలో తేలింది. ఆ హోటల్‌లో ఆహార పరిస్థితి కూడా అలాగే కనిపించింది. అలాగే గాజువాక జోన్‌లో పనిచేసే ఒక అధికారి నిత్యం బిర్యానీ తీసుకువెళ్లే ఒక హోటల్‌లో తనిఖీ చేయగా నిల్వ ఉంచిన చికెన్, నాణ్యత లేని మసాలా, రుచికోసం రసాయనాలు వినియోగించినట్టు తేలింది. కల్తీ, మితిమీరిన రసాయనాలు కలిపిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్టార్‌హోటళ్లలో కూడా అదే పరిస్థితి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వాటిని కూడా ఉపేక్షించేది లేదు.